అఖిలప్రియకు స్ట్రాంగ్ వార్నింగ్ - భర్త జోక్యంపై చంద్రబాబు సీరియస్..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కూటమి పార్టీలు సొంత నేతల వివాదాల పైన ఫోకస్ చేసాయి. పార్టీ గీత దాటేవారి కి తుది హెచ్చరికలు చేస్తున్నారు. టీడీపీలో వరుసగా పలువురు నేతలను పిలిపించి వివరణలు తీసుకుంటున్నారు. తాజాగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ కు పార్టీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే భర్త జోక్యం పైనా కీలక హెచ్చరిక జారీ అయినట్లు సమాచారం.
వివాదాలు.. వ్యాఖ్యలతో పార్టీకి సమస్యగా మారుతున్న ఎమ్మెల్యేల పైన టీడీపీ నాయకత్వం ఫోకస్ చేసింది. వారి పైన సీరియస్ గా ఉంది. వారిని నేరుగా పార్టీ ప్రధాన కార్యాలయానికి పిలిపించి వారి నుంచి వివరణ తీసుకుంటున్నారు. వారికి తుది హెచ్చరిక చేస్తున్నారు. పరిస్థితుల్లో మార్పు రావాలని తేల్చి చెబుతున్నారు. తాజాగా బోండా ఉమా నుంచి వివరణ తీసుకున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్.. ఇప్పుడు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ను తాజా వివాదాల పైన వివరణ కోరారు. ఆళ్లగడ్డ లో రాజకీయంతో పాటుగా అహోబిలం దేవాలయ టెండర్ల వివాదంపై పార్టీ సీరియస్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు పిలిచించి అన్ని విషయాలు చర్చించారు. అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కీలక అంశాల్లో జోక్యం చేసుకోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పల్లా స్పష్టం చేసినట్లు సమాచారం.

పార్టీ నిర్ణయాలకు నడుచుకుంటా
తాజాగా అహోబిలం ఆలయంలో తలనీలాల కాంట్రాక్ట్ వ్యవహారంలో అఖిలప్రియ జోక్యం చేసుకోవడంతో కూటమిలో విభేదాలు తలెత్తాయి. అఖిల ప్రియ భర్త కారణంగా జనసేన, బీజేపీ నాయకులతో విభేదాలు తలెత్తాయని పార్టీ భావిస్తోంది. దీంతో.. ఈ వ్యవహారం పైన పార్టీ నాయకత్వం సీరియస్ గా ఉంది. ఎమ్మెల్యేగా అఖిలప్రియ మాత్రమే బాధ్యతలను చూసుకోవాలని.. ఆమె భర్త జోక్యం ఎంతమాత్రం ఉండటానికి వీల్లేదని పల్లా తేల్చి చెప్పినట్లు సమాచారం. పార్టీ క్రమశిక్షణను దాటితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని చెప్పినట్లు తెలుస్తోంది. భూమా దంపతుల స్థాయికి తగినట్లుగా అఖిల పనిచేయాలని, వారి పేరు నిలబెట్టాలని సూచించారని సమాచారం. దీంతో, తాను పార్టీ సూచనలు తప్పక పాటిస్తానని అఖిలప్రియ హామీ ఇచ్చారు. ఆళ్లగడ్డలో ఏ చిన్న సంఘటన జరిగినా దానిని పెద్ద సెన్సేషన్‌గా మారుస్తున్నారని అఖిల వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలోని వివాదాలు, సమస్యలపై పార్టీ అధ్యక్షుడికి పూర్తి స్పష్టత ఇచ్చినట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications