సీబీఐ ఎంట్రీపై నిషేధం చెల్లదిక-ఢిల్లీ పోలీసు చట్టానికి సవరణ బిల్లు-చంద్రబాబు అనుభవంతో
గతంలో చంద్రబాబు హయాంలో ఏపీలో సీబీఐ ఎంట్రీని నిషేధిస్తూ టీడీపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లో కేంద్రం నుంచి తప్పుకుని ఎన్డీయేపై ధర్మపోరాటం ప్రారంభించిన చంద్రబాబును సీబీఐ అరెస్టు చేస్తుందన్న భయంతో టీడీపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. సీబీఐ ప్రత్యేకంగా నిషేధాజ్లలు లేని ప్రాంతాల్లో మాత్రమే వెళ్లేందుకు అనుమతి కల్పిస్తున్న ఢిల్లీ స్పెషల్ పోలీసు యాక్ట్ కారణంగా అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోగలిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని సవరిస్తోంది.

ఢిల్లీ ప్రత్యేక పోలీసు చట్టం
ఢిల్లీ స్పెషల్ పోలీసు చట్టం ప్రకారం ఏర్పాటైన సంస్ధ సీబీఐ. కేంద్ర నేర పరిశోధనా సంస్ధగా ఉన్నప్పటికీ దీన్ని ఢిల్లీ పోలీసు యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేయడంతో దీనికి పరిమిత అధికారాలు మాత్రమే దక్కాయి. దీంతో ఢిల్లీలో పూర్తిస్ధాయిలో మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆంక్షలతో మాత్రమే దీనికి ఎంట్రీ అధికారాలు ఉన్నాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర పాలిత ప్రాంతమైనా ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి సీబీఐని తమ ప్రాంతంలోకి రాకుండా ఆంక్షలు విధించవచ్చు. దీన్ని ధిక్కరించే అధికారం సీబీఐకి లేదు. కేంద్రం, రాష్ట్రాల మధ్య పోరు సాగుతున్న ఈ రోజుల్లో సీబీఐని రాష్ట్ర ప్రభుత్వాలపైకి, తమ ప్రత్యర్ధులపైకి ఉసిగొల్పుతున్న కేంద్రానికి ఇది ఇబ్బందిగా మారింది.

చంద్రబాబు హయాంలో సీబీఐకి నో ఎంట్రీ
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజుల్లో కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ తో మిత్రపక్షంగా కొనసాగింది. ఆ తర్వాత కొంతకాలానికి ఎన్డీయే ప్రభుత్వంతో విభేదాలు వచ్చి టీడీపీ బయటికి వచ్చేసింది. అప్పట్లో టీడీపీని, ముఖ్యంగా చంద్రబాబును టార్గెట్ చేసేందుకు సీబీఐని ఉసిగొల్పేందుకు కేంద్రం సిద్ధమైంది. దీంతో విషయం పసిగట్టిన చంద్రబాబు.. ఏపీలోకి సీబీఐకి ఎంట్రీ లేకుండా నిషేధం విధించారు. ఇది కేంద్రానికి మంట పుట్టించింది. తాము కోరుకున్న విధంగా ఏపీకి సీబీఐ అధికారుల్ని పంపి చంద్రబాబును లొంగదీసుకునేందుకు చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో కేంద్రం అహం దెబ్బతింది. అప్పటి నుంచి సీబీఐ విషయంలో కేంద్రం పునరాలోచన చేస్తోంది.

ఢిల్లీ పోలీసు చట్టానికి సవరణ
రాష్ట్రాల్లోకి సీబీఐ ఎంట్రీని నిషేధిస్తూ తమ ప్రత్యర్ధులు చంద్రబాబు, మమతా బెనర్జీ వంటి వారు గతంలో నిషేధాలు విధించడంతో ఎన్డీయే సర్కార్... మరోసారి ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ప్రయత్నాలు ప్రారంభించింది. ఢిల్లీ పోలీసు యాక్ట్ ను సవరించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఢిల్లీ పోలీసు చట్టాన్ని సవరిస్తూ తాజాగా ఇవాళ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టింది. దీన్ని పార్లెమెంటులో ఆమోదింపజేసుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ దీనిపై చర్చ జరగాల్సి ఉంది. దీన్ని ఆమోదిస్తే ఇక సీబీఐకి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.

ఎన్డీయే ప్రత్యర్ధులకు చుక్కలే
ఢిల్లీ ప్రత్యేక పోలీసు చట్టంలో సీబీఐని రాష్ట్రాల్లో స్వేచ్ఛగా తిరగకుండా ఉన్న ఆంక్షల్ని తొలగిస్తూ కేంద్రం తాజాగా సవరణ బిల్లు తీసుకొచ్చింది. ఇది పార్లమెంటు ఆమోదం పొందితే ఇక సీబీఐ ఏ రాష్ట్రంలోకి అయినా, కేంద్ర పాలిత ప్రాంతంలోకి అయినా ఎవరి అనమతి లేకుండానే అడుగు పెట్టేందుకు వీలవుతుంది. ఇప్పటికే ఎన్ఐఏతో పాటు ఇతర కేంద్ర దర్యాప్తు సంస్ధలు దేశవ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్లి తనీఖీలు చేసే వీలుంది. ఎవరినైనా అదుపులోకి తీసుకునే వీలుంది.ఇప్పుడు పార్లమెంటులో ఢిల్లీ పోలీసు చట్టానికి సవరణలు కూడా ఆమోదం పొందితే సీబీఐకి కూడా అదే తరహా అధికారాలు దక్కనున్నాయి. దీంతో ఇక ఎన్డీయే సల్కార్ కు ప్రత్యర్ధులుగా ఉన్నవారు, ప్రత్యర్ధులుగా మారాలనుకుంటున్న వారికి కూడా భవిష్యత్తులో చుక్కలు చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications