అభివృద్ధి భేష్: చంద్రబాబు, ఆ విగ్రహాల తొలగింపు
హైదరాబాద్: గడిచిన తొమ్మిది నెలల్లో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పది అంశాలపై అధికారులుకు సూచనలు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, రాష్ట్రానికి సాయం చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. కేంద్రం సాయం చేస్తేనే ముందుకెళ్లగలమన్నారు. సాయం కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు. గోదావరి నీటి తరలింపు వల్ల అక్కడి రైతులకు ఇబ్బంది ఉండదని, సముద్రంలో కలిసే నీటినే తరలిస్తామని స్పష్టం చేశారు.

నీరు-చెట్టు కార్యక్రమం చాలా ముఖ్యమైనదని చెప్పారు. అన్ని చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలని, అదనంగా చెక్‌డ్యాంలు నిర్మించాలని అన్నారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. వర్షపు నీటిని భూగర్భ జలంగా మార్చుకోవాలని సూచించారు. 3వేల టిఎంసిల నీరు సముద్రంలో కలిసిపోతోందని అన్నారు.
రాష్ట్రంలోని విగ్రహాల తొలగింపు
రాష్ట్రంలో రోడ్లపై ఉన్న ఫ్లెక్సీలు, విగ్రహాలు తొలగించాలని పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖలకు ఏపి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం జాతీయ నాయకుల విగ్రహాలు మినహాయించి మిగిలిన విగ్రహాలను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 15 రోజుల్లోగా ఈ విగ్రహాలను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది.












Click it and Unblock the Notifications