చెప్పులతో తిరుమల శ్రీవారి ఆలయంలోకి- ఒకదానికి మించి మరొక అపచారం
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 70,462 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,393 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.01 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

ఈ పరిస్థితుల మధ్య తిరుమలలో మహాపరాథం చోటు చేసుకుంది. ముగ్గురు భక్తులు చెప్పులతో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. క్యూలైన్ దాటుకుని ఏకంగా ఆలయం మహా ద్వారం వరకు వచ్చేశారు. ఏ మాత్రం ఆలస్యం జరిగి ఉన్నా ఆ ముగ్గురు కూడా చెప్పులతో ఆలయంలోకి అడుగు పెట్టుండేవాళ్లే.
ఆ సమయంలో మహాద్వారం వద్ద గుర్తించిన విధి నిర్వహణలో ఉన్న టీటీడీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. చెప్పులు వదిలి ఆలయంలోనికి వెళ్లాలని చెప్పారు. దీనితో- ఆ ముగ్గురూ తమ చెప్పులను మహాద్వారం వద్ద వదిలేసి ఆలయంలోకి ప్రవేశించారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
క్యూ లైన్‌ను దాటుకుని ఈ ముగ్గురు భక్తులు చెప్పులతో ఏకంగా మహా ద్వారం వద్దకు ఎలా వచ్చారనేది అంతు చిక్కట్లేదు. ఈ విషయంలో టీటీడీ విజిలెన్స్ విభాగం గానీ, సిబ్బంది గానీ నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది స్పష్టమౌతోంది. నిజానికి- వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి భక్తులు ప్రవేశించే సమయంలోనే విజిలెన్స్, టీటీడీ ఉద్యోగులు గుర్తించాల్సి ఉంటుంది.
అక్కడే భద్రతా సిబ్బంది భక్తులను తనిఖీ చేస్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి మొబైల్ ఫోన్ తీసుకెళ్లడం, చెప్పులను ధరించి అక్కడ అడుగు పెట్టడం నిషేధం. నిషేధిత వస్తువులు ఏవైనా ఉన్న వాటిని తీసుకుని లోనికి వెళ్లడానికి అనుమతించరు. విసృతంగా తనిఖీ చేసిన తరువాతే భక్తులను క్యూ కాంప్లెక్స్‌లోకి పంపిస్తుంటారు.
ఇప్పుడు మాత్రం ముగ్గురు భక్తులు పాదరక్షలతోనే మహాద్వారం వరకు వచ్చేయడం కలకలం రేపింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద భద్రత సిబ్బంది వీరిని గుర్తించకపోవడం వల్లే వారు పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. వాళ్లు ఏ మాత్రం పట్టించుకోకపోవడం వల్ల ఈ దుస్థితి తలెత్తింది.












Click it and Unblock the Notifications