మున్సిపల్ ఎన్నికల బ్రేక్ వెనుక ఏం జరిగింది ? ఎస్ఈసీ ప్రకటనకు ముందు, వెనుక..!
ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో 19 పట్టణ స్ధానిక సంస్ధల్లో నామినేషన్ల గడువు పొడిగించాలంటూ వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. దీన్ని పరిశీలించాలని ఎస్ఈసీని (SEC) ఆదేశించింది. అలాగే నామినేషన్ల గడువు పొడిగింపుపై ఇవాళ్టి లోగా నిర్ణయం తీసుకోమని చెప్పింది. దీంతో ఆ 19 చోట్ల నామినేషన్ల గడువు పొడిగిస్తారని, ఎన్నికల్ని కూడా వాయిదా వేస్తారని అంతా భావించారు. కానీ నిన్న రాత్రి కల్లా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎస్ఈసీ కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. దీంతో వైఎస్సార్సీపీ తమ ఫిర్యాదుల్ని పట్టించుకోవడం లేదని, తమ అభ్యర్దులు నామినేషన్లు వేసే పరిస్దితి లేదని, కాబట్టి నామినేషన్ల గడుపు పొడిగించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పలు ఆదేశాలు ఇచ్చింది. ఇందులో నామినేషన్ల గడువు పొడిగింపు అంశాన్ని ఎస్ఈసీ పరిశీలించడం, తుది అభ్యర్ధుల జాబితాను 25లోగా ఖరారు చేయకుండా వాయిదా వేయడం, జిల్లా కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ, అన్ని పార్టీల అభ్యర్ధులకు తగిన భద్రత కల్పించడం వంటి అంశాలున్నాయి. వీటిపై ఈ 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పోరేషన్లు ఉన్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ నిన్న మాట్లాడారు. అయితే నివేదికలు మాత్రం వెంటనే రాలేదు. అదే సమయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వుల కాపీ కూడా ఆలస్యంగా అందింది.

ఈ నేపథ్యంలో కేవలం 19 సీట్లకు మాత్రమే నామినేషన్ల పొడిగింపు ఇచ్చి, ఎన్నికలు వాయిదా వేస్తే మిగిలిన చోట్ల కూడా ఇలాంటి డిమాండ్లు వచ్చే అవకాశం ఉందని ఎస్ఈసీ భావించింది. అదే సమయంలో ప్రభుత్వం (AP Govt) కూడా ఎన్నికల్ని స్వేచ్చగా నిర్వహిస్తున్నట్లు చెప్పుకునేందుకు వీలుగా మొత్తం అన్ని సీట్లలో తదుపరి ఎన్నికల ప్రక్రియ నిలిపివేసి, తగు జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహించేలా ఎస్ఈసీకి సూచనలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో 19 సీట్లకు బదులుగా 100 సీట్లలో ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసి, ఇవాళ్టి కల్లా ఎస్పీలు, కలెక్టర్ల నివేదికలు తెప్పించుకుని, ఎన్నికల పోలింగ్ వాయిదాపై నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియ నిలిపేస్తున్నట్లు నిన్న రాత్రి ఎస్ఈసీ ప్రకటన విడుదల చేయగానే కూటమి పార్టీల తరఫున ఎస్ఈసీ నిర్ణయాలకు అనుగుణంగా వ్యవహరిస్తామంటూ ఉమ్మడి ప్రకటన కూడా వెలువడింది. దీంతో ఎస్ఈసీ నిర్ణయానికి ముందే ఈ ప్రకటన సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సూచన మేరకే ఎస్ఈసీ ఇలా ఎన్నికల్ని మూడు, నాలుగు రోజుల పాటు వాయిదా వేసేందుకు, నామినేషన్ల గడువును ఒకటి లేదా రెండు రోజులు పొడిగించే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications
