ఏం జరిగింది..!: సోము వీర్రాజుని ఎదగకుండా వెంకయ్య తొక్కేస్తున్నారా?
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఎదుగుదలని ఆ పార్టీలోని నేతలే జీర్ణించుకోలేకపోతున్నారా? అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు. తమ అవినీతి కుంభకోణాల నుంచి బయటపడేందుకే బీజేపీ కొందరు నేతలు చేరుతున్నారని, ఆ తర్వాత సొంత పార్టీలోనే విషాన్ని చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని కార్యకర్తలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఏపీలో బీజేపీ సొంతంగా రాష్ట్రంలో బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు సాహసం చేయలేదు. అయితే సోము వీర్రాజు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయన నాయకత్వంలో రాజమండ్రిలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభ విజయవంతం అవడంతో పార్టీలోని నేతలే ఖంగుతిన్నారు.
అంతేకాదు ఏపీలో బీజేపీకి ఇంత సత్తా ఉందా? అని కూడా అనుకున్న వాళ్లు లేకపోలేదు. ఆరోజు నుంచి బీజేపీలో విభేదాలు బయటపడినట్లు సమాచారం. పార్టీలో సోము వీర్రాజు ఎక్కడ ఎదిగిపోతడానే భయంతో ఆయన ఎదుగుదలను కొందరు నేతలు అడ్డుకోవాలనే ఆలోచనకు తెరతీశారు.
ఏపీలో టీడీపీ-బీజేపీ మిత్రపక్షాలు ఉన్నప్పటికీ, టీడీపీ నేతలపై విమర్శలు చేయడానికి సోము వీర్రాజు ఏ మాత్రం వెనకాడటం లేదు. అదను దొరికినప్పడల్లా టీడీపీ మంత్రులు, ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఏపీలో బీజేపీ బలపడాలంటే సోము వీర్రాజు లాంటి నాయకుడికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని శ్రేణులు భావించాయి.
ఈ క్రమంలో రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం కాకుండా ఆయనపై అనే రకాల చాడీలు చెప్పి అడ్డుకున్నారని వీర్రాజు అనుచరులు ఆగ్రహంతో వున్నారు. జనాన్ని సమీకరించలేని శక్తులు అన్నివేల మందిని సమీకరించిన సోము వీర్రాజు శక్తిని భరించలేక ఓర్వలేనితనంతో వూగిపోతున్నారని ఆయన సన్నిహితులు ఆరోపిస్తున్నారు.

ఇటీవల విజయవాడలో జరిగిన బిజెపి కోర్ కమిటీ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సిద్ధార్ధ నాద్ సింగ్.... సోము వీర్రాజుని రాజమండ్రి సభకు ఎంత నిధులు వసూలు చేశారు? ఎంత ఖర్చు చేశారో సమావేశంలో జమా ఖర్చు చెప్పాలని అడిగినట్లు తెలిసింది. దీనిని బట్టి సోము వీర్రాజు అంటే గిట్టని వారు ఎవరో అతనిపై విషం కక్కుతున్నారని ఆయన అనుచరులు కోపంతో ఉన్నారు.
బహిరంగ సభకు భారీగా వసూలు చెయ్యటానికి తమదేమన్నా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీయా? అని ప్రశ్నిస్తున్నారు. రాజమండ్రి సభకు స్వచ్చందంగా కార్యకర్తలు తరలివచ్చారని అందులో వీర్రాజు గొప్ప ఏదీ లేదని ఆలోచన వచ్చేలా చేస్తున్నారని ఆయన అనుచరులు ఆగ్రాహావేశంతో ఉన్నట్లు తెలిసింది.
పార్టీలో సోము వీర్రాజుకు వస్తున్న ప్రజాదరణను పాడు చేసేందుకు పార్టీలోని కొందరు వ్యక్తులే అదేపనిగా అతనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంచార్జి సింగ్ ఒక కొత్త విధానం తెరపైకి వీర్రాజు ద్వారా దేశంలోనే తొలిసారి తెచ్చారు.
దేశంలోనే ఇలా ఎక్కడా జరగలేదని వీర్రాజు అనుచరులు ప్రశ్నిస్తున్నారు. అయితే పార్టీలోనే ఉంటూ, కేంద్ర మంత్రిగా పనిచేస్తూ, ట్రస్ట్‌ల ద్వారా వేల కోట్లు పొందుతున్న వారి జమా ఖర్చులు కూడా అడిగితే బాగుండేదని సోము వీర్రాజు పరోక్షంగా వెంకయ్య నాయుడిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications