సిరిసిల్ల రాజేశ్వరి గ్రేట్, కాళ్లతో కవిత్వం: సుద్దాల అవార్డు (పిక్చర్స్)
హైదరాబాద్: కాళ్లతో కవిత్వం రాసి సిరిసిల్ల రాజేశ్వరి సాహితీవేత్తల మెప్పు పొందింది. అంగవైకల్యంపై ఆత్మవిశ్వాసంతో ఆమె విజయం సాధించింది. చేతులు లేకున్నా, శరీరం సహకరించకున్నా కాళ్లతో రచనలు చేసింది. ఆమెకు సుద్దాల ఫౌండేషన్ సుద్దాల హనుమంతు జానకమ్మ జానపద కళాపీఠం ఆధ్వరంలో ఆమెకు అవార్డు ప్రదానం జరిగింది.
సిరిసిల్ల రాజేశ్వరికి 2014 సంవత్సరానికిగాను ప్రతిష్టాత్మకమైన సుద్దాల హనుమంతు జానకమ్మ స్మారక పురస్కారాన్ని ప్రదానం చేశారు. హైదరాబాదులోని రవీంద్రభారతిలో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. కాళ్లతో కలం పట్టి కవిత్వం రాసిన సిరిసిల్ల రాజేశ్వరి కవితల సంపుటిని జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి. నారాయణ రెడ్డి ఆవిష్కరించారు.
అంగవైకల్యం కలిగిన రాజేశ్వరి అంతరంగ వైకల్యం లేకుండా కవితలను రచించడం అభినందనీయమని ఆయన అన్నారు. పరిణతి చెందిన కవులు కూడా ఇంత గొప్పగా కవిత్వం రాయలేరని ఆయన అన్నారు. ఆమెకు కవితలే లోకాంతులను వెదజల్లుతాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం తన కలంతో ఉద్యమ గీతాలు రచించినందుకు ఆమెను సినారె అభినందించారు.

రాజేశ్వరికి అవార్డు
సిరిసిల్ల రాజేశ్వరికి అవార్డు ప్రదానం చేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కెవి రమణాచారి, రసమయి బాలకిషన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.

చేతన ఉత్తేజ్ నృత్యం
రాజేశ్వరికి అవార్డు ప్రదానం చేసిన సందర్భంగా ఏర్పాటు సాంస్కృతిక కార్యక్రమంలో చేతన ఉత్తేజ్ చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది.

రమణాచారి హామీ
తమ ఫౌండేషన్ చేస్తున్న కృషికి ప్రభుత్వ సహాయం కావాలని అశోక్ తేజ అభ్యర్థించగా, ప్రభుత్వ సహకారం తప్పకుండా ఉంటుందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి హామీ ఇచ్చారు.

రాజేశ్వరికి రసమయి వందనం
సామాన్యుని జీవితం కష్టాలను ఎదుర్కుని నిలిచిన హనుమంతు గొప్ప వ్యక్తి అని శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ కొనియాడారు. కులవృత్తిని కాకుండా ప్రజల విముక్తి కోసం కళారంగాన్ని ఎంచుకున్నారని ఆయన అన్నారు. కాళ్లతో కలం పట్టి కవిత్వాన్ని రాసిన రాజేశ్వరి కాళ్లకు ఆయన వందనం చేసి అభినందించారు.

గురువులకు అశోక్ తేజ సత్కారం
రాజేశ్వరికి అవార్డు ప్రదానం చేసిన సందర్భంగా ప్రముఖ సినీ గేయ రచయిత అశోక్ తేజ తన గురువులు బి. మల్లయ్య, కె. భగవంత్ రెడ్డిలను సత్కరించారు.

అవార్డు ప్రదానం
కాళ్లతో కవిత్వం రాసిన సిరిసిల్ల రాజేశ్వరికి అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి ప్రముఖులు సినారె, నారాయణమూర్తి తదితరులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications