దిశా చట్టం క్రింద ముందు శిక్షించాల్సింది సీఎం జగన్ నే ; వైసీపీ నేతలపైనా ధ్వజమెత్తిన దివ్య వాణి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రమ్య హత్యోదంతం రాజకీయ రగడకు కారణమైంది. గుంటూరులో పట్టపగలు నడిరోడ్డు మీద బీటెక్ విద్యార్థినిని అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హతమార్చిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మహిళలపై దాడులు పెరిగాయని, దిశా వంటి చట్టాలను తీసుకు వచ్చినా నిత్యం మహిళలు వేధింపులకు గురవుతూనే ఉన్నారని, ప్రేమ పేరుతో ఉన్మాదులు యువతను బలి తీసుకుంటూనే ఉన్నారని ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువగా మారాయి.

దిశా చట్టంతో ఇప్పటివరకు ఎంతమందిని శిక్షించారు
తాజాగా రమ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన టిడిపి నేతలను పోలీసులు అరెస్టు చేయడంతో టిడిపి నేతలు నిప్పులు చెరుగుతున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించడం కూడా తప్పేనా అంటూ ప్రశ్నిస్తున్న టిడిపి నేతలు జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. రాష్ట్రంలో మహిళా రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నారు. తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి ప్రభుత్వం తీసుకు వచ్చామని చెబుతున్న దిశా చట్టం తో ఇప్పటి వరకు ఎంత మందిని శిక్షించారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించాలని కోరుతున్న టిడిపి నేతల అరెస్టు అప్రజాస్వామికమని దివ్యవాణి మండిపడ్డారు.

గన్ కంటే జగన్ ముందు వస్తాడన్న గబ్బునోళ్లు రమ్య కుటుంబానికి ఏం సమాధానం చెబుతాయి
రాష్ట్రాన్ని అప్పులతో అధోగతి పాలు చేసిన జగన్, లేని చట్టాలతో ప్రజలను మోసం చేస్తున్నారని దివ్యవాణి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో దిశా చట్టం ఉందని చెబుతున్వారు , ఇప్పటివరకు ఆ చట్టం కింద నేరం చేసిన వారిని ఎందుకు శిక్షించ లేదని దివ్యవాణి ప్రశ్నించారు. గన్ కంటే జగన్ ముందు వస్తాడన్న గబ్బునోళ్లు రమ్య కుటుంబానికి ఏం సమాధానం చెబుతాయని దివ్యవాణి వైసిపి నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతిపై అత్యాచారం చేసిన వైసీపీ కార్యకర్తలను ఏం చేశారని దివ్యవాణి ప్రశ్నించారు. మహిళతో అసభ్యంగా ఫోన్లో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కు దిశ చట్టం వర్తించదా అని దివ్యవాణి ప్రశ్నించారు.

దిశా చట్టం క్రింద శిక్షించాల్సి వస్తే ముందు శిక్ష వెయ్యాల్సింది జగన్ కే
అమరావతి ఆడబిడ్డల పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వైసిపి ఎన్నారై విభాగానికి ఏం శిక్షలు వేశారని దివ్యవాణి ప్రభుత్వాన్ని నిలదీశారు. అసలు దిశ చట్టం కింద శిక్షించాల్సి వస్తే ముందు శిక్షించాల్సింది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డినే అంటూ దివ్యవాణి నిప్పులు చెరిగారు. రాజధాని మహిళల వేధింపులకు కారణమైన, ఇప్పటికే పలువురు ప్రాణాలను బలిగొన్న జగన్ ముమ్మాటికీ శిక్షార్హుడే అని దివ్యవాణి స్పష్టం చేశారు. నాడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్ గా తయారు చేయాలనుకుంటే, వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పని చేస్తున్న మహిళా మంత్రులు, బూతుల మంత్రులు కొందరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జూదాంధ్రప్రదేశ్ గా తయారు చేస్తున్నారని దివ్యవాణి నిప్పులు చెరిగారు.

రెండేళ్ళ పాలనలో 230 మంది ఆడవారు బలి .. జగన్ ఏం చేశారు ?
రెండు సంవత్సరాల మీ పరిపాలనలో 230 మంది ఆడవారు బలైపోయారని , గన్ కన్నా ముందు వచ్చే జగన్ ఎక్కడ అని ప్రశ్నించారు దివ్యవాణి. రాష్ట్రంలో మహిళలు నిత్యం వేధింపులకు గురవుతుంటే, ఎంతో మంది యువతులు బలైపోతుంటే వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు పూలాభిషేకం చేయించుకుంటూ, తామేదో ఘనకార్యం చేసినట్టు మురిసిపోతున్నారు అని దివ్యవాణి విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాలికలపై అత్యాచారాలు పెరిగిపోయాయని రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకున్న వివిధ సంఘటనలు ఏకరువు పెట్టిన దివ్యవాణి దిశా చట్టం ఏమైపోయింది అంటూ జగన్ ను నిలదీశారు. తాడేపల్లిలో సామూహిక అత్యాచారానికి గురైన యువతికి న్యాయం చేశారా అని ప్రశ్నించారు. ఇక తాజాగా ప్రేమోన్మాది చేతిలో దారుణంగా హత్యకు గురైన రమ్య కుటుంబానికి న్యాయం చేయాలని దివ్యవాణి డిమాండ్ చేశారు. ప్రశ్నించే గొంతు నొక్కేయడం లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారని దివ్యవాణి విమర్శించారు.












Click it and Unblock the Notifications