తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 20న ఆ సేవలు రద్దు.. ఎందుకంటే!
కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల పైన కొలువుతీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా దీపావళి ఆస్థానాన్ని నిర్వహిస్తున్నారు. దీపావళి ఆస్థానం దీపావళి పండుగ సందర్భంగా శాస్త్రోక్తంగా నిర్వహించే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. దీపావళి రోజున ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందున్న ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది.
శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
ఇది భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించే ఒక ప్రత్యేకమైన పండుగ. స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక సాయంత్రం ఐదు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారు సహస్రదీపాలంకరణ సేవలో, ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

ఈ సేవలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన టీటీడీ
దీపావళి ఆస్థానం కారణంగా అక్టోబర్ 20వ తేదీన స్వామివారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేశారు. ఇక స్వామివారి తోమాల సేవ. అర్చన సేవలను అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తారు. కాగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారిఆలయం, కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయాల్లో అక్టోబరు 20వ తేదీ దీపావళి సందర్భంగా శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహించనున్నారు.
గోవిందరాజస్వామి ఆలయంలో దీపావళి ఆస్థానం
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుండి సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల మధ్య నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి స్వామివారికి సమర్పిస్తారు. అనంతరం దీపావళి ఆస్థానం నిర్వహిస్తారు.శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో దీపావళి సందర్భంగా రాత్రి 7 నుండి 8 గంటల వరకు దీపావళి ఆస్థానం నిర్వహిస్తారు.
కోదండరామ స్వామి ఆలయంలో దీపావళికి ప్రత్యేక పూజలు
దీపావళి సందర్భంగా సోమవారం రాత్రి 7 గంటలకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీకోదండరామస్వామివారికి సమర్పిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేకంసేవ, హనుమంత వాహనసేవను టిటిడి రద్దు చేసింది.
వేణుగోపాల స్వామి ఆలయంలో దీపావళి ఆస్థానం
కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో దీపావళి సందర్భంగా సాయంత్రం 5 గంటలకు దీపావళి ఆస్థానం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉదయం 8 నుండి 9 గంటల వరకు శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఉత్సవ విగ్రహాలకు స్నపన తిరుమంజనం జరుగనుంది. సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications