418 రాళ్ళు వెనకేసుకున్న వ్యక్తి.. కిడ్నీలో రాళ్ళు తొలగించిన వైద్యులే షాక్!!
సహజంగా ఎవరైనా నాలుగు రాళ్లు వెనకేసుకోమని చెబుతూ ఉంటారు. అది వారు సంపాదించిన సంపాదన విషయంలో.. అయితే ఒక రోగి మాత్రం ఏకంగా కిడ్నీలో 418 రాళ్ళను వెనక వేసుకున్నాడు. ఆ రోగి కిడ్నీలో నుంచి రాళ్ళను తొలగించిన ఆసుపత్రి వైద్యులు ఈ రాళ్ళను చూసి షాక్ కి గురయ్యారు. ఇంతకీ విషయం ఏమిటంటే..
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ సోమాజిగూడలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆసుపత్రిలో ఒక వ్యక్తి చేరాడు. 60 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి కిడ్నీ దెబ్బ తినడం కారణంగా ఆసుపత్రిలో చేరినట్టు గుర్తించిన వైద్యులు, వివిధ పరీక్షల అనంతరం అతని మూత్రపిండాలలో పెద్ద సంఖ్యలో రాళ్లు ఉన్నట్టు గుర్తించారు.

దీంతో చికిత్స నిర్వహించి సదరు వ్యక్తి కిడ్నీలో ఉన్న రాళ్లను తొలగించాలని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆసుపత్రి వైద్య బృందం డాక్టర్ కే పూర్ణ చంద్ర రెడ్డి, డాక్టర్ గోపాల్, డాక్టర్ దినేష్ నిర్ణయించారు. అయితే ఎటువంటి ఆపరేషన్ చేయకుండా, ఎలాంటి కోత లేకుండా కిడ్నీలో ఉన్న రాళ్ళను బయటకు తీయాలని నిర్ణయించి పెర్క్యుటేనియస్ నెఫ్రోలితోటమీ విధానంలో మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో శస్త్ర చికిత్సను నిర్వహించారు.
చిన్న చిన్న రంధ్రాల ద్వారా లోపలకు సూక్ష్మ కెమెరాలను పంపి లేజర్ ప్రోబ్ ల ద్వారా రాళ్లను బయటకు తీశారు. మొత్తం ఆ వ్యక్తి కిడ్నీలో దాదాపు 418 రాళ్లు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. మొత్తం ఈ విధానంలో చికిత్స చేయడానికి, అతని కిడ్నీలో ఉన్న రాళ్ళను తీయడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టిందని వైద్యులు చెబుతున్నారు.
అనంతరం అతని కిడ్నీ పనితీరు మెరుగుపడటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం పేషెంట్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, కిడ్నీల ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మూత్రపిండాలను అసలే నిర్లక్ష్యం చేయొద్దని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications