చంద్రబాబు సర్కార్ లోనూ జగన్ హవా..! సాక్ష్యాలివిగో..!
ఏపీలో చంద్రబాబు, జగన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే రాజకీయంగా బద్ధ శత్రువులు అని అంతా అనుకుంటుంటారు. కానీ వీరి ప్రభుత్వాల్లో వారికి తెలుసో, తెలియకో పరస్పరం సహకరించుకున్న సందర్భాలు కూడా ఎన్నో కనిపిస్తాయి. గతంలో మద్యం టెండర్లు, షాపుల విషయంలో ఇలాంటి విమర్శలే అధికార, విపక్ష పార్టీల మధ్య వినిపించేవి. అలాగే లీజుల విషయంలోనూ ఇలాంటి సీన్లే కనిపించేవి. ఇప్పుడు అలాంటి పరిణామాల్లో తిరిగి చంద్రబాబు సర్కార్లో కనిపిస్తున్నాయి.
కడప జిల్లా అంటేనే వైఎస్ కుటుంబానికి పెట్టని కోట. రాష్ట్రంలో అధికారంలో ఎవరున్నా కడప జిల్లాల్లో హవా మాత్రం వైఎస్ కుటుంబీకులదే ఉంటుంది. దశాబ్దాలుగా వారు పాతుకుపోయిన తీరు అలాంటిది. అలాంటి కడప జిల్లాలో ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నా టీడీపీ నేతలు మాత్రం వైఎస్ కుటుంబానికి జీ హుజూర్ అంటున్నారు. జిల్లాలో ఈసారి ఎన్నికల్లో వైఎస్ కుటుంబ హవాకూ, వైసీపీ హవాకూ చెక్ పెట్టేశామని సంబర పడుతున్న చంద్రబాబుకు ఇది షాకింగ్ పరిణామమే.

తాజాగా వైఎస్ కుటుంబానికి చెందిన వెంకటరెడ్డికి బైరెటీస్ గనుల అనుమతులు సంక్రాంతి సందర్బంగా సెలవుల్ని కూడా పట్టించుకోకుండా అధికారులు మంజూరు చేసేశారు. దీంతో మీడియాలో వార్తలు వచ్చాయి. ఇది చూసిన ప్రభుత్వం కళ్లు తెరిచి ఇప్పుడు వాటిపై చర్యలు తీసుకుంటోంది. ఆ అనుమతుల్ని రద్దు చేస్తోంది. దీని గురించి జనం ఆరా తీసే లోపే ఇలాంటిదే మరో ఘటన కనిపించింది. దాన్ని తవ్వుతుంటే ఇంకొన్ని కనిపించే పరిస్ధితులు ఉన్నాయి. ఫైనల్ గా కూటమి పెద్దలకు షాకులు తప్పడం లేదు.
ఈసారి జగన్ చిన్నాన్న వరుసయ్యే మాజీఆర్టీసీ ఛైర్మన్ అబ్బిరెడ్డి గారి మల్లిఖార్జునరెడ్డికి తాజాగా వరుసగా క్వార్జ్ లీజులు మంజూరు కావడం కలకలం రేపుతోంది. గత ప్రభుత్వంలో తమ హవాతో ఈ-వేలంలో ఏకపక్షంగా లీజులు దక్కించుకున్న వీరికే ఇప్పుడు వాటిని కట్టబెడుతూ అధికారులు ఫైళ్లపై సంతకాలు చేసేస్తున్నారు. ఇలా వైఎస్సార్ జిల్లాతో పాటు అనంతపురం జిల్లాలోనూ లీజుల్ని వైఎస్ కుటుంబీకులు దక్కించుకోవడం, అధికారులు ఉత్తర్వులు ఇచ్చేస్తుండటంతో సీఎం చంద్రబాబుకే ఏం చేయాలో తోచని పరిస్ధితి ఎదురవుతోంది.












Click it and Unblock the Notifications