నిన్న అమ్మాయిని, నేడు లేగదూడలను చంపేసిన కుక్కలు: ప్రభుత్వం సీరియస్
గుంటూరు: జిల్లాలోని కాకనూరులో కుక్కల స్వైర విహారంపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. కుక్కలు దాడులకు పాల్పడుతున్నా.. నిర్లక్ష్యంగా వ్యవహరించారని గ్రామ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు వేసింది. కుక్కల దాడిలో ఇటీవల ఓ ఆరేళ్ల పాప మృతి చెందగా, శుక్రవారం రెండు లేగదూడలు ప్రాణాలు కోల్పోయాయి.
ఇటీవల ఆరేళ్ల చిన్నారిపై పది కుక్కలు మూకుమ్మడి దాడి చేసి కరిచాయి. కుక్కల దాడిలో గాయపడిన చిన్నారి బాలిక అక్కడికక్కడే మరణించింది. ఈ సంఘటన కాకుమానులో విషాదాన్ని నింపింది. ఇంటి నుంచి స్నానానికి వెళ్తున్న బాలికపై కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. దాంతో పాప పొట్టలోని పేగులు బయటకు వచ్చాయి.

కాగా, చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. కొద్ది రోజుల క్రితం కూడా ఓ బాలికపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో గాయపడిన బాలికను గుంటూరు ఆస్పత్రికి తరలించారు.
ఈ సంఘటన జరిగి వారం రోజులు గడవక ముందే కుక్కల దాడిలో రెండు లేగ దూడలు మరణించడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం గ్రామ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు వేసింది.












Click it and Unblock the Notifications