జగన్ జైలుకు పోకతప్పదు: బొజ్జల, సోమిరెడ్డిపై ఫిర్యాదు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పిల్ల చేష్టలు మానుకొని ప్రభుత్వానికి సలహాలు ఇస్తే మంచిదని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మంగళవారం అన్నారు. గుంటూరు జిల్లాలో ఆయన మాట్లాడారు. జగన్ రుణమాఫీ పథకం అమలు ఎలా చేస్తారని తమ ప్రభుత్వాన్ని పదే పదే విమర్శించడం మానుకోవాలన్నారు.
జగన్ మాటలు పిల్ల చేష్టలను తలపిస్తున్నాయన్నారు. ఆయన ప్రతిపక్ష నేతగా కూడా మిగలరని ఎద్దేవా చేశారు. జైలుకు పోక తప్పదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విప్ పని చేస్తుందో లేదో ఆ పార్టీ నాయకులు తెలుసుకొని ప్రజాస్వామ్యరీతిలో వ్యవహరించాలని హితవు పలికారు. ఎర్ర చందనం స్మగ్లర్ గంగిరెడ్డిని జైలుకు పంపిస్తామన్నారు.

సోమిరెడ్డిపై జగన్ పార్టీ ఫిర్యాదు
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన క్రిమినల్ చర్యలు తీసుకునేలా ఏపీ డీజీపీని ఆదేశించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్ రెడ్డిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కోరింది.
పార్టీ నేతలు జూపూడి ప్రభాకర రావు, అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మలు రమాకాంత్ రెడ్డిని కలిశారు. పంచాయతీరాజ్ చట్టాలను ఉల్లంఘిస్తూ సోమిరెడ్డి ఉద్దేశ్యపూర్వకంగా ప్రకటనలు జారీ చేశారని, ప్రజాప్రతినిధులను గందరగోళానికి గురి చేసే ప్రయత్నం చేశారని ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications