ఏపీ కొత్త రుణాలకు ఢిల్లీ కేంద్రంగా రఘురామ బ్రేకులు..!!
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రూటు మార్చారు. ఏకంగా ప్రభుత్వ ఆర్దిక వ్యవస్థపైన ప్రభావం పడేలా లేఖలు మొదలు పెట్టారు. ఏపీకి కొత్త రుణాలకు అనుమతులు ఇవ్వద్దంటూ కేంద్ర ఆర్దిక శాఖ కార్యదర్శికి రఘురామ లేఖ రాసారు. ఏపీకి అప్పుల భారం పెరిగిపోయిందంటూ వివరాలను అందించారు. చేబదుళ్ల మీద రోజులు నెట్టుకొస్తోందని తన లేఖలో వివరించారు. ఈ పరిస్థితుల్లో అదనపు రుణాలకు అనుమతి ఇస్తే రాష్ట్ర ఆర్దిక పరిస్థితిని చేజేతులా నాశనం చేసిన వారవుతారని పేర్కొన్నారు.
ఏపీలో ఆర్దిక పరిస్థితిని వివరిస్తూనే.. కొత్త రుణాలకు అనుమతి ఇవ్వద్దంటూ కేంద్ర ఆర్దిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ కు రఘురామ లేఖ రాసారు. 2022-23 ఆర్దిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్ నుంచి ఇప్పటికే ఏపీకి రూ 46 వేల కోట్ల రుణ సేకరణకు అనుమతి ఇచ్చారని లేఖలో వివరించారు. ఏపీ రుణం ఇప్పటికే రూ 9.03 లక్షల కోట్లకు చేరిందని ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వార్షికాదాయం రూ 1.50 లక్షల కోట్లు ఉంటే, రుణాలు - వడ్డీల కింద రూ 55 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందని వివరించారు. రాష్ట్ర రెవిన్యూ లోటు రూ 55వేల కోట్లు దాటే సూచనలు ఉన్నాయని రఘురామ పేర్కొన్నారు. చేసిన అప్పులను సర్దుబాటు చేసే వరకూ ఏపీకి కొత్తగా అప్పులకు అవకాశం ఇవ్వద్దంటూ కేంద్రానికి రాసిన లేఖలో రఘురామ సూచించారు.

ఏపీలో ప్రస్తుతం ఆర్దికంగా సమస్యలు ఉన్నాయి. సంక్షేమం కోసం పెద్ద మొత్తంలో ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇప్పటికే సంక్షేమ పథకాలను ఆపేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని సీఎం మొదలు పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా ప్రధానితో సీఎం జగన్ భేటీ సమయంలో ఏపీకి రుణ పరమితులపై చర్చ జరిగింది. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ...ఆర్దిక వ్యవస్థ నిర్వహణ కీలకంగా మారుతోంది. సంక్షేమంతో పాటుగా నిర్వహణా ఖర్చులు.. మౌళిక వసతులు కీలకం కానున్నాయి. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం కొత్తగా పన్నుల భారం పెంచి ఆదాయం పెంచుకొనే అవకాశాలు లేవు. ఏపీలో ఉన్న ఆర్దిక పరిస్థితుల్లో ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే రఘురామ ఈ లేఖలు రాసినట్లు అధికార పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications