రెస్టారెంట్ స్టైల్ "బెండకాయ పకోడీ" ఎప్పుడైనా తిన్నారా..?
బెండకాయ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కూరగాయ. దీనిని ఇంగ్లీషులో ఓక్రా (Okra) లేదా లేడీస్ ఫింగర్ (Lady's Finger) అని అంటారు. ముఖ్యంగా భారతీయ వంటకాల్లో కూడా బెండకాయని ఎక్కువగా ఉపయోగిస్తారు. అందులో ఉండే పోషక విలువలు అధికంగా ఉండడం.. సులభంగా జీర్ణమయ్యే గుణం కారణంగా దీనిని తరచుగా ఆహారంలో చేర్చుతారు. అయితే బెండకాయ అంటే చాలామందికి ఇష్టముండదు.
బెండకాయ బంకగా ఉంటుందని.. రుచి ఉండదని ఎక్కువ మంది తినడానికి ఆసక్తి చూపరు. కానీ కొందరు మాత్రం బెండకాయ వేపుడు మాత్రమే తింటుంటారు. ఈ తరహా విషయాలు అన్నింటికీ చెక్ పెడుతూ పిల్లలకి అయిన పెద్దలకు అయినా కానీ ఇష్టంగా బెండకాయ తినిపించేందుకు బెస్ట్ ప్లాన్ ఇదే. అదే బెండకాయ పకోడీ.. అయితే వాళ్లకు నార్మల్ ఉల్లిపాయ పకోడీతో పోలిస్తే బెండకాయలతో చేసినవి మంచి రుచికరంగా ఉంటాయి. తయారు చేసుకోవడం కూడా సులువే. ఈ కమ్మని బెండకాయ పకోడీ ఎలా చేసుకోవాలో మీకోసం ప్రత్యేకంగా..

కావాల్సిన పదార్థాలు..
- బెండకాయలు - అర కేజీ
- శనగపిండి - ఒకటిన్నర కప్పులు
- ఉప్పు - రుచికి సరిపడా
- మసాలా - అర టీస్పూన్
- ధనియాల పొడి - 1 టీస్పూన్
- పసుపు - అర టీస్పూన్
- కారం - ఒకటిన్నర కప్పులు
- నిమ్మరసం - 2 టీస్పూన్లు
తయారీ విధానం..
- ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకుని రెండు వైపులా చివర్లు కట్ చేసుకోవాలి.
- అనంతరం ఒక బెండకాయ తీసుకుని పొడుగ్గా సగానికి కట్ చేసుకోవాలి. అనంతరం ఒక భాగాన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి మధ్యలోకి కట్ చేసుకోవాలి.
- బెండకాయ ముక్కల్లోకి శనగపిండి, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, కారం, నిమ్మరసం, 1 టేబుల్‌స్పూన్ నూనె పోసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
- ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని పకోడీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకుని పక్కన ఉంచాలి.
- స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్‌ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె కాగినాక మంటను సిమ్‌లో పెట్టి కలిపి పెట్టుకున్న బెండకాయ ముక్కలను విడివిడిగా నూనెలో వేసుకోవాలి.
- కడాయికి సరిపడా వేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి నిధానంగా తిప్పుతూ వేయించుకోవాలి.
- బెండకాయ ముక్కలు క్రిస్పీగా వేగినాక తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే మిగిలిన బెండకాయ ముక్కలను కూడా నూనెలో వేయించి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే
- బెండకాయ పకోడీ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
చిట్కాలు..
బెండకాయలు లేతవి తీసుకుంటే పకోడీ టేస్ట్ బాగుంటుంది.
పకోడీలు మరింత క్రిస్పీగా ఉండాలనుకుంటే కాస్త బియ్యప్పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు.
బెండకాయ ముక్కలను కలపడానికి నీటిని ఎక్కువ యూజ్ చేయకూడదు.












Click it and Unblock the Notifications