తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ సూచనలు
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం నాడు 76,773 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 29,100 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.16 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బాట గంగమ్మ ఆలయం వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 15 నుంచి 20 గంటల సమయం పట్టింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబరు 20 తేదీన దీపావళి ఆస్థానం నిర్వహించనుంది టీటీడీ. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తోంది. దీపావళి నాడు ఉదయం 7 నుండి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థాన కార్యక్రమం ఏర్పాటవుతుంది. ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవితో కలిసి శ్రీమలయప్పస్వామి ఘంటా మండపంలో ఏర్పాటు చేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు.

సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది. సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
దీపావళి ఆస్థానం కారణంగా అక్టోబరు 20న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.
తిరుమలలో మంగళవారం రాత్రి పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. సాయంత్రం 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, బోర్డు సభ్యులు నరేష్, పేష్కార్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications