జనసైనికులకు డబుల్ బొనాంజా.. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అకిరా !
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ ఈసారి మాట నిలబెట్టుకున్నారు. ఎన్నికల ముందు ఈసారి గెలిచి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేసుకుందాం అని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా పిఠాపురం సమీపంలోని చిత్రాడలో చేయబోతున్నారు. పార్టీ స్థాపించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో.. తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశం మొత్తం ఈ కార్యక్రమం గురించి మాట్లాడుకునేలా కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్నారు.
సినిమాల్లోనే కాకుండా రాజకీయాల పరంగా కూడా తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. 100 శాతం స్ట్రైక్ రేటుతో గత ఎన్నికల్లో నిలబడిన ప్రతిచోట పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోగలిగారు. అంతే కాకుండా ప్రధాని మోడీ సైతం ప్రతిసారీ పవన్ గురించి నెక్స్ట్ లెవెల్లో చెబుతుండడం ఆయన ఫేమ్ ని మరింత పెంచింది. దీంతో ఇన్నాళ్లు అధికారం లేకుండానే పార్టీ కార్యక్రమాలను ధీటుగా నిర్వహిస్తున్న జనసేన నేతలు ఈసారి భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.

రేపు ఈ కార్యక్రమం జరగనుండగా.. హోలీ రోజు కూడా కావడంతో మరింత ప్రతిష్టాత్మకంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ సభ వేదిక గానే పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఈ విషయం ఇప్పటికే సోషల్ మీడియాలో సైతం చక్కర్లు కొడుతుండడంతో మెగా అభిమానులు, జనసైనికులు డబుల్ బొనాంజా అంటూ ఫుల్ ఖుషి అవుతున్నారు.
ఇక ఇప్పటికే అకిరా నందన్ కుంగ్ ఫూ, కరాటేతో పాటు మ్యూజిక్, డాన్స్ లలో కూడా శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అకిరా కంపోజ్ చేసిన సాంగ్స్, వీడియో లను రేణు దేశాయ్ పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ వేడుకల్లో మాత్రం అకిరా కలరిపట్టు అనే ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ సైతం తన ఫస్ట్ సినిమాకే మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రావీణ్యం పొందారు. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రంలో రియల్ గా స్టంట్స్ చేయడం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. దీంతో తండ్రికి తగ్గ తనయుడు అంటూ అకిరాని తెగ పొగిడేస్తున్నారు.
మరోవైపు జనసేన అధికారంలో ఉన్న తర్వాత జరుగుతున్న తొలి సభ కావడంతో.. ఇప్పటికే 10 లక్షల మంది వస్తారని ఒక అంచనా వేస్తున్నారు. 1600 మంది పోలీసులు భద్రత నడుమ ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే జిల్లా ఎస్పీ, జనసేన ముఖ్య నేతలు సభ వేదిక వద్ద ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. రూట్ మ్యాప్, వీఐపీ, వీవీఐపీ సీటింగ్.. పార్కింగ్ సహా హెల్పర్స్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications