తాళి కట్టే లోపే ప్రియుడితో పెళ్లికూతురు జంప్.. వరుడు షాక్!
మంగళవాయిద్యాల మోతతో ఆ కల్యాణ మండపమంతా మారుమోగిపోతోంది. పురోహితుల వేద మంత్రోచ్చరణల మధ్య, బంధువుల కోలాహలంతో పెళ్లి వేడుక అట్టహాసంగా జరుగుతోంది. సరిగ్గా ముహూర్తం సమయానికి వధూవరుల తలలపై జీలకర్ర బెల్లం పెట్టించారు. ఇక కొద్దిసేపట్లో వరుడు వధువు మెడలో మూడు ముళ్లు వేయాల్సి ఉంది. సరిగ్గా అదే సమయంలో సినిమాను తలపించేలా ఒక అపరిచిత యువకుడు హడావుడిగా మండపం ముందుకు వచ్చి నిలుచున్నాడు. అతడిని చూడగానే పీటలపై ఉన్న వధువు ముఖం వెలిగిపోయింది. అందరూ షాక్ అయ్యేలా పీటల మీద నుంచి లేచి, ఒక్క ఉదుటన మండపం దిగి నేరుగా ఆ యువకుడి పక్కన వెళ్లి నిలిచింది.
వధువు చేసిన పనికి వరుడు నిలువునా నీరైపోయాడు. పెళ్లికి వచ్చిన బంధువులు, ఊరి జనం అసలేం జరుగుతుందో అర్థం కాక నిర్ఘాంతపోయారు. "ఎవరీ అబ్బాయి?" అని అందరూ నిలదీసేసరికి.. వధువు ఏమాత్రం తడుముకోకుండా, "ఇతను మా ఊరు వాడే.. మేమిద్దరం ప్రేమించుకున్నాం. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు" అంటూ కుండబద్దలు కొట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

తాళికట్టే సమయానికి ప్రియుడు ఎంట్రీ..
నిజానికి, మైలవరం నియోజకవర్గ పరిధిలోని రెండు వేర్వేరు గ్రామాలకు చెందిన యువతీ యువకులకు పెద్దలు ఈ పెళ్లి నిశ్చయించారు. శుక్రవారం రాత్రి వరుడి ఇంటి వద్దే అత్యంత వైభవంగా వివాహ వేడుక ఏర్పాటు చేశారు. సరిగ్గా తాళికట్టే సమయానికి ప్రియుడు ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. తన ప్రియుడి కోసమే తాను ఎదురుచూస్తున్నట్లు వధువు స్పష్టం చేయడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన వరుడి తరపు వారు, పెళ్లి చెడగొట్టడానికి వచ్చిన ప్రియుడిపై చేయి చేసుకున్నారు. ఘర్షణ పెద్దదయ్యే సూచనలు కనిపించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి గొడవను సద్దుమణిగించారు.
మా పరువు తీస్తారా?
ఈ పరిణామంతో వరుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. "మాకు ఉన్నది ఒక్కగానొక్క కొడుకు. వాడి పెళ్లిని ఊరంతా మెచ్చేలా చేయాలనుకున్నాం. దాదాపు 20 లక్షల రూపాయలు ఖర్చు చేసి, బ్రహ్మాండమైన విందు భోజనాలు ఏర్పాటు చేశాం. వేల మంది భోజనం చేసి వెళ్లారు. అంతా అయిపోయాక, తాళి కట్టే ముందర ఇలా పెళ్లి ఆపేసి మా పరువు తీస్తారా?" అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నాడు ఇరు వర్గాల వారు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి, చివరికి ఒక పరిష్కారానికి రావడంతో ఈ హైడ్రామా ముగిసింది. అయితే, ఈ 'ఫిల్మీ స్టైల్' పెళ్లి గొడవ మాత్రం మైలవరంలో హాట్ టాపిక్‌గా మిగిలిపోయింది.












Click it and Unblock the Notifications