తలకాయలు చెడగొట్టుకోవద్దు, అవుతుంది: టీపై డిఎస్
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై తలకాయలు చెడగొట్టుకోవద్దని తెలంగాణకు చెందిన పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. ఆయన సోమవారంనాడు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. సోనియాను కలిసిన తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విశ్వాసంతో కనిపించారు. వచ్చే ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.
రాష్ట్ర విభజన కచ్చితంగా జరిగి తీరుతుందని ఆయన అన్నారు. ప్రజలు కూడా ఈ విషయంలో విశ్వాసంతో ఉండాలని కోరుతున్నట్లు ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా అన్నారు. ప్రజల్లో అనుమానాలు తలెత్తడానికి అవకాశం ఇవ్వవద్దని ఆయన మీడియాను కోరారు. కాంగ్రెసు అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రణాళిక ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు.

బిజెపి మద్దతుపై అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, బిజెపి నేత సుష్మా స్వరాజ్ తెలంగాణ బిల్లు పెట్టండి, మద్దతు ఇస్తామని పదే పదే చెబుతున్నారని ఆయన అన్నారు. ప్రజలకు అనుమానాలు లేవని, తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై విశ్వాసంతో ఉన్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కాంగ్రెసులో విలీనం కావడానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధం ఏమిటని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా ఎదురు ప్రశ్న వేశారు.
విభజన రాజ్యాంగం ప్రకారం జరగాల్సిన ప్రక్రియ అని ఆయన అన్నారు. ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయని, దీనిపై మరింతగా చర్చ అవసరం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనలో జాప్యం లేదని ఆయన స్పష్టం చేసారు. బిల్లులో లోపాలున్నాయని వస్తున్న విమర్శలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, పెద్ద న్యాయనిపుణులు దాన్ని తయారు చేశారని చెప్పారు. పనికి రాని మాటలపై దృష్టి సారించవద్దని, తలకాయాలు పాడు చేయవద్దని ఆయన మీడియాకు సలహా ఇచ్చారు. సానుకూల దృక్పథంతో చూడాలని కూడా ఆయన సూచించారు.
నాన్చడమే ప్రక్రియ అని లగడపాటి రాజగోపాల్ చెప్పిన మాటలను మీడియా ప్రితినిధులు ప్రస్తావించగా, ఈ స్థాయికి అంశం వస్తుందని వారు అనుకోలేదని ఆయన అన్నారు. శాసనసభ అభిప్రాయం చెప్పడానికి రాష్ట్రపతి 40 రోజులు గడువు ఇచ్చారని, తొందరపడుతన్నారనే అనుమానం రాకుండా చేశారని ఆయన అన్నారు. అన్నీ రాజ్యాంగబద్దంగా, సక్రమంగా జరుగుతున్నాయని ఆన అన్నారు. విభజన అనేది అనివార్యమని, లోపాలుంటే తర్వాత పరిష్కరిస్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications