అమరావతిలో ఇల్లు: జగన్‌కు కేఈ ఆఫర్, కోర్టుకెళ్లి టైమడిగిన వైసిపి
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి గురువారం నాడు సెటైర్లు వేయగా, మంత్రి పత్తిపాటి పుల్లారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్‌కు చెందిన రూ.749 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేఈ వ్యంగ్యంగా మాట్లాడుతూ... జగన్‌ను అమరావతికి ఆహ్వానిస్తామని, ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పారు. జఫ్తు చేసుకున్న ఆస్తుల్లో జగన్ ఇల్లు లోటస్ పాండు, సాక్షి కార్యాలయం కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేఈ సెటైర్ వేశారు.
హైకోర్టు విభజన వివాదంపై కేఈ స్పందిస్తూ.. ఇది కేంద్రం పరిధిలోని అంశమని చెప్పారు. ఏపీ హైకోర్టు కోసం అమరావతిలో ఇప్పటికే నిర్మాణ స్థలం చూపించామని చెప్పారు. చంద్రబాబు గతంలోనే ఈ విషయమై లేఖ రాశారని తెలిపారు. ఏపీలో హైకోర్టు నిర్మాణానికి కేంద్రమే నిధులు ఇవ్వాలన్నారు.

జగన్ పైన పత్తిపాటి ఆగ్రహం
జగన్ పైన పత్తిపాటి మండిపడ్డారు. ఏపీలో అభివృద్ధిని జగన్ అడుగడుగునా అడ్డుకుంటున్నారని విమర్శించారు. కావాలనే ఆయన ఇలా చేస్తున్నారని ఆరోపించారు. అయినా వారి ఆటలు సాగవని, రాజధానిని అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు.
అమరావతి అభివృద్ధితోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కనుమరుగు కావడం ఖాయమన్నారు. వైసిపి నేతలకు రుణమాఫీ అంసం పైన ప్రశ్నించే అర్హత లేదన్నారు. అధిక మొత్తంలో రుణమాఫీ చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనని చెప్పారు.
పార్టీ ఫిరాయింపులపై విచారణ వాయిదా
పార్టీ ఫిరాయింపులపై వైసిపి దాఖలు చేసిన పిటిషన్ పైన గురువారం నాడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. వాదనలు వినిపించేందుకు వారం రోజులు గడువు కావాలని వైసిపి తరఫు న్యాయవాది కోరారు. వైసిపి అభ్యర్థనకు అంగీకరించిన సర్వోన్నత న్యాయస్థానం విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications