Mango Rates: రైతులకు పండగే ఇంక.. తోతాపురి మామిడికి మార్కెట్‌లో రికార్డ్ రేట్లు!
వేసవి ఇంకా పూర్తిగా మొదలుకాకముందే మామిడి మార్కెట్ మంట పుట్టించింది! సాధారణంగా సీజన్ చివర్లోనే దొరికే తోతాపురి మామిడి ఈసారి మాత్రం మొదటి అడుగులోనే రికార్డు క్రియేట్ చేసింది. "తోతాపురికి ఇంత రేటా?" అని రైతులే ఆశ్చర్యపోయేలా, వ్యాపారులే నమ్మలేని స్థాయిలో ధరలు దూసుకెళ్తున్నాయి.
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట నుంచి ముంబై మార్కెట్‌కు ఎగుమతి అయిన తోతాపురి మామిడికి టన్నుకు రూ.1,05,000 ధర లభించింది. అంటే కిలోకు రూ.100కు పైగానే పలకడం విశేషం. సాధారణంగా మధ్య సీజన్‌లో కూడా అందుకోవడం కష్టమైన ఈ రేట్లు, ఈసారి సీజన్ మొదట్లోనే రావడం మామిడి రైతుల్లో ఆనందాన్ని నింపుతోంది.

ఇప్పటివరకు తోతాపురి అంటే జ్యూస్, పల్ప్ పరిశ్రమలకే పరిమితమయ్యేది. కానీ ఈ ఏడాది కథ పూర్తిగా మారిపోయింది. ఉత్తర భారతదేశంలో తోతాపురి మామిడికి నేరుగా తినే పండుగా (టేబుల్ ఫ్రూట్) విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇదే ధరల దూకుడుకు ప్రధాన కారణంగా మారింది.
గత సీజన్ చివరలో చిత్తూరు మార్కెట్‌లో తోతాపురి ధరలు టన్నుకు రూ.12,000-14,000 మధ్యకే పరిమితమై, రైతులను తీవ్ర నష్టాల్లోకి నెట్టాయి. కానీ ఈ ఏడాది పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. నిల్వలు తక్కువగా ఉండటం, ముంబై వంటి మెట్రో నగరాల్లో భారీగా డిమాండ్, నాణ్యమైన కాయల లభ్యత.. ఈ మూడు అంశాలు కలసి ధరలను ఆకాశానికి ఎత్తేశాయి.
ప్రస్తుతం మార్కెట్‌కు వస్తున్న మామిడి కాయలు నాణ్యత పరంగా బాగుండటం, ఎగుమతులకు అనుకూలమైన వాతావరణం ఉండటం విస్సన్నపేట ప్రాంత రైతులకు పెద్ద ప్లస్‌గా మారింది. సాధారణంగా "తోతాపురికి తక్కువ రేటే" అనే భావనను తలకిందులు చేస్తూ, లక్ష రూపాయల మార్కును దాటడం ఒక రికార్డు అని వ్యాపారులు చెబుతున్నారు.
ఇదే ధరల ధోరణి రానున్న నెలల్లో కూడా కొనసాగితే, గత కొన్నేళ్లుగా నష్టాలతో ఇబ్బంది పడుతున్న మామిడి రైతులు ఈసారి భారీ లాభాలు గడించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వేసవి రాకముందే మామిడి ఇలా మంట పుట్టిస్తే... సీజన్ పీక్‌లో పరిస్థితి ఎలా ఉంటుందోనని మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి












Click it and Unblock the Notifications