భారత్‌ను వణికిస్తున్న వ్యాధి.. లక్షణాలు లేకుండానే వేలల్లో బాధితులు..?
ఈశాన్య భారతంలో టీబీపై నిర్వహించిన ప్రత్యేక స్క్రీనింగ్ ఒక కీలక హెచ్చరికను ఇచ్చింది. దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి స్పష్టమైన లక్షణాలు లేకుండానే వేలాది మందిలో క్షయవ్యాధి బయటపడింది. లక్షణాలు కనిపించకపోవడం వల్ల రోగులు ఆలస్యంగా గుర్తింపుకు రావడం, అప్పటికే ఇతరులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉండటం ఆరోగ్య శాఖకు ప్రధాన సవాలుగా మారింది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2025-26 వార్షిక నివేదిక ప్రకారం, జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద 2025 జనవరి నుంచి అక్టోబర్ వరకు ఈశాన్య రాష్ట్రాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. మొత్తం 39 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించగా, 41,727 టీబీ కేసులు గుర్తించారు. వీరిలో 14,356 మందికి ఎలాంటి లక్షణాలు లేవు.

టీబీ స్క్రీనింగ్‌లో బయటపడిన కీలక విషయం
మొత్తం కేసుల్లో సుమారు 34 శాతం మంది లక్షణాలు లేకుండానే టీబీతో ఉన్నట్లు గుర్తించడం సాధారణ నిర్ధారణ విధానాల పరిమితిని చూపిస్తోంది. ఆసుపత్రికి వచ్చిన వారిని మాత్రమే పరీక్షిస్తే ఇలాంటి కేసులు దొరకకపోవచ్చు. అందుకే ప్రమాదంలో ఉన్న వర్గాలు, బలహీన సమూహాలను లక్ష్యంగా చేసుకుని ఇంటింటి స్థాయిలో స్క్రీనింగ్‌ను పెంచుతున్నారు.
ఈ కార్యక్రమంలో దాదాపు 6 లక్షల మందికి ఛాతీ ఎక్స్-రేలు తీశారు. లక్షణాలు లేని కేసులను గుర్తించడంలో ఎక్స్-రేలు, నమూనా పరీక్షలు కీలకంగా మారాయి. మేఘాలయలో 'కాఫ్ ఎగైనెస్ట్ టీబీ’ యాప్‌తో పాటు ఏఐ ఆధారిత పోర్టబుల్ ఎక్స్-రే యూనిట్లను వినియోగించడం వంటి చర్యలు ముందస్తు గుర్తింపుకు తోడ్పడుతున్నాయి.
అస్సాంలో అత్యధిక లక్షణాల్లేని టీబీ కేసులు
లక్షణాలు లేని టీబీ కేసుల్లో అస్సాం 10,362 కేసులతో ముందుంది. మేఘాలయలో 1,055, నాగాలాండ్‌లో 857, త్రిపురలో 510 కేసులు నమోదయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో 479, మణిపూర్‌లో 465, సిక్కింలో 380, మిజోరంలో 248 కేసులు గుర్తించారు. ఈ గణాంకాలు ఈశాన్య రాష్ట్రాల్లో క్రియాశీల స్క్రీనింగ్ అవసరాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.
లక్షణాలు కనిపించని రోగులు చికిత్స ఆలస్యం చేసే అవకాశం ఎక్కువ. టీబీ చికిత్స మధ్యలో ఆపినా, ఆలస్యంగా ప్రారంభించినా వ్యాధి నియంత్రణ కష్టమవుతుంది. అందుకే నిర్ధారణ తర్వాత వైద్యుల సూచనల ప్రకారం పూర్తి కాలం మందులు తీసుకోవడం అత్యంత ముఖ్యం.
టీబీ నిర్మూలనలో ముందస్తు గుర్తింపు, సకాలంలో చికిత్స, ప్రజల్లో అవగాహన కీలకం. దీర్ఘకాలిక దగ్గు, జ్వరం, రాత్రివేళ చెమటలు, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. లక్షణాలు లేకపోయినా ప్రమాదంలో ఉన్నవారు స్క్రీనింగ్‌కు ముందుకు రావడం వ్యాధి వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడుతుంది.












Click it and Unblock the Notifications