నెల్లూరులో భూకంపం, 'అనంత'లో సభ్య సమాజం తలదించుకునే ఘటన
అమరావతి: అనంతపురం జిల్లాలో బుధవారం సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఒకటి జరిగింది. వివరాల్లోకి వెళితే, జిల్లాలో పాపంపేటలోని చంద్రబాబు కాలనీలో నివాసం ఉంటున్నరాజేశ్వరీ, నారాయణమ్మ కుటుంబాల మధ్య గత కొంతకాలంగా ప్రహరీ గోడ వివాదం నడుస్తోంది.
ఈ వివాదంపై ఇరు కుటుంబాలు కోర్టులో సైతం కేసు నమోదు చేశాయి. తాజాగా బుధవారం ఈ ప్రహరీ గోడ నిర్మాణంలో తలెత్తిన వివాదం మహిళను వివస్త్రను చేసి దాడి చేసే వరకు వెళ్లింది. నారాయణమ్మ కొడుకులు శ్రీకాంత్, హరి అక్రమంగా ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టడాన్ని రాజేశ్వరీ ప్రశ్నించింది.
దీంతో ఈ గొడవ చిలికి చిలికి గాలి వానలా పెద్దదైంది. రాజేశ్వరీ కుటుంబంపై ఎదురు దాడికి దిగిన నారాయణమ్మ కొడుకులు ఆమె కూతుర్ని వివస్త్రను చేసి చితకబాదారు. అడ్డు వచ్చిన తల్లిదండ్రులపైన పిడిగుద్దులు కురిపించారు. ఈ దాడిలో గాయపడిన రాజేశ్వరీ కూతురు ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

దాడి అనంతరం రాజేశ్వరీ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు తమ ఫిర్యాదు పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆరోపిస్తున్నారు. తన ఒంటిపై బట్టలన్నీ ఊడదీశారని అన్నా... అన్నా... వదిలేయండి అని బ్రతిమాలినా వారు వినలేదని బాధితురాలు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది.
కాళ్లు మొక్కానని, ఒంటిపై నూలు పోగైనా లేకుండా అత్యంత దారుణంగా తనపై దాడికి దిగారని బాధితురాలు కన్నీటిపర్యంతమైంది.
నెల్లూరులో భూకంపం
నెల్లూరులో బుధవారం సాయంత్రం స్వల్ప భూకంపం సంభవించింది. జిల్లాలోని వరికుంటపాడు, జడదేవి, కడియంపాడు, నర్రవాడ, లక్ష్మీపురం, దాసరిపురం, తూర్పు తెన్నెంపల్లె, తూర్పుబోయమడుగు గ్రామాల్లో 3 సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంపం కారణంగా ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గడచిన ఆరు నెలల్లో నెల్లూరు జిల్లాలో నాలుగు సార్లు భూమి కంపించింది.












Click it and Unblock the Notifications