ఏపీలో బాటిళ్లలో పెట్రోల్ విక్రయాలపై నిషేధం-కారణమిదే ?
ఏపీలోని పెట్రోల్ బంకుల్లో బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ విక్రయించకుండా ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి బాటిళ్లలో పెట్రోల్, చమురు ఉత్పత్తుల బహిరంగ విక్రయంపై నిషేధం ఉన్నా క్షేత్రస్ధాయిలో అది అమలు కావడం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో అధికారులు దీనిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. దీంతో పెట్రోల్ బంకులకు తాజా ఆదేశాలు వెళ్లాయి.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు సాధారణ ప్రజలను సైతం భయబ్రాంతుల్ని చేస్తున్నాయి. ముఖ్యంగా పోలింగ్ రోజు నుంచే పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు తీవ్ర కలకలం రేపాయి. అందులోనూ పల్నాడు ప్రాంతాల్లో పెట్రోల్ బాంబులు విసురుకోవడం, నిల్వ చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఈసీ పెట్రోల్ ను బాటిళ్లలో అమ్మకుండా నిషేధం విధించింది.

రాష్ట్రంలో ఎన్నికల తదనంతర హింసపై ఇప్పటికే ఈసీ ఆగ్రహంగా ఉంది. రాష్ట్రంలో హింసపై సమగ్ర విచారణకు సిట్ ను కూడా నియమించింది. ఇవాళ, రేపట్లో పల్నాడు, రాయలసీమలో హింసాత్మక ఘటనలపై దర్యాప్తు పూర్తి చేసి ఈసీకి సిట్ నివేదిక కూడా ఇవ్వబోతోంది. ఇవాళ మధ్యాహ్నం క్షేత్రస్ధాయిలో దర్యాప్తు కోసం సిట్ అధికారులు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ బాటిళ్లలో విక్రయించకుండా చూడాలని పెట్రోల్ బంకుల యజమానులకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications