నేడే మున్సిపల్ ఛైర్మన్లు- డిప్యూటీల ఎన్నిక : కొండపల్లి లో ఉత్కంఠ - ఎవరికి దక్కేను..!!
తాజాగా ఎన్నికలు జరిగి ఫలితాలు వెల్లడైన మున్సిపాల్టీల్లో ఈ రోజు (సోమవారం) ఛైర్మన్లు.. డిప్యూటీ ఛూర్మన్ల ఎన్నిక జరగనుంది. నెల్లూరు కార్పోరేషన్ తో పాటుగా 12 మున్సిపాల్టీల్లో ఈ ఎన్నిక కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రత్యేక అధికారులను నియమించింది. నెల్లూరు కార్పొరేషన్‌లో 54 డివిజన్లకు ఎన్నికైన కార్పొరేటర్లు ఉదయం 11 గంటలకు సమావేశమై మేయరు, ఇద్దరు డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు.

ఎన్నిక జరిగే మున్సిపాల్టీలు
అకివీడు (పశ్చిమ గోదావరి జిల్లా), జగ్గయ్యపేట, కొండపల్లి (కృష్ణా), దాచేపల్లి, గురజాల (గుంటూరు), దర్శి (ప్రకాశం), బుచ్చిరెడ్డిపాలెం (నెల్లూరు), బేతంచెర్ల (కర్నూలు), కమలాపురం, రాజంపేట (వైఎస్సార్), పెనుకొండ (అనంతపురం), కుప్పం (చిత్తూరు జిల్లా) మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికైన సభ్యులు ఎక్కడికక్కడ ఉదయం 11 గంటలకు సమావేశమై చైర్మన్, ఇద్దరు వంతున వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు.
ముందుగా ఎన్నికైన కార్పోరేటర్లు..వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యులకు కూడా ఎక్స్ అఫిషియో సభ్యుల హోదాలో మేయర్, డిప్యూటీ మేయరు, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలో ఓటువేసే హక్కు ఉండడంతో, నిబంధనల ప్రకారం ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారికి ప్రత్యేకంగా ఓటుహక్కు కల్పించినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు.

దర్శిలో టీడీపీ.. కొండపల్లిపై ఉత్కంఠ
ఇక, ఈ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయితీని టీడీపీ కైవసం చేసుకుంది. నగర పంచాయతీలో 20 వార్డులు ఉండగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున 13 మంది, వైసీపీ నుంచి ఏడుగురు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు సోదరుడు నారపుశెట్టి పిచ్చయ్యను టీడీపీ అధిష్ఠానం చైర్మన్ అభ్యర్థిగా ముందుగానే ప్రకటించింది.
ఆయనతోపాటు మరో ఇరువురు వైస్‌చైర్మన్‌లను కూడా ఎన్నుకుంటారు. ఇక, క్రిష్టా జిల్లా కొండపల్లి నగర పంచాయితీ ఛైర్మన్ గిరీ పైన ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్ది టీడీపీకి మద్దతు ప్రకటించటంతో నగర పంచాయితీ తమదేనని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫీషియో ఓటు కీలకంగా మారింది.

కీలకం కానున్న ఎక్స్ అఫీషియో ఓట్లు
ఈ రోజున కొండపల్లిలో చైర్మన్, వైఎస్ చైర్మన్ల ఎన్నిక కొనసాగినప్పటికీ హైకోర్టు తీర్పు మేరకు తుది ఫలితం అధికారికంగా ప్రకటించే అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు. గెలుపొందిన 29 మంది వార్డు సభ్యులతో పాటు ఎక్స్‌అఫిషియో సభ్యులు ఎంపీ కేశినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌లను ఎన్నికలకు ఆహ్వానించనున్నట్టు తెలిపారు. 16 మంది సభ్యుల కోరం ఉన్నట్లయితే చైర్మన్, ఇద్దరు వైస్ చైర్మన్ల ఎన్నికలు జరపనున్నట్లు తెలిపారు. కోరం లేకపోతే మరుసటి రోజుకు వాయిదా వేసి, ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళతామని చెప్పారు.
Recommended Video

ఛైర్మన్ ..ఇద్దరు డిప్యూటీ ఛైర్మన్లు
తొలుత 29మంది సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. నెల్లూరులో ఒక వైపు వరదలు.. మరో వైపు ఈ రోజున నగర పాలక సంస్థకు ఎన్నికైన కొత్త పాలక వర్గం కొలువు తీరనుంది. ఇప్పటికే వైసీపీ అమలు చేస్తున్న సామాజిక సమీకరణాల ఫార్ములాకు అనుగుణంగా ఏ మున్సిపాల్టీలో ఛైర్మన్ అభ్యర్ధి.. వైస్ అభ్యర్దులెవరనేది దాని పైన స్థానిక నేతలకు పార్టీ అధినాయకత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ మధ్నాహ్నానికి ఎంపిక ప్రక్రియ పూర్తి కానుంది.












Click it and Unblock the Notifications