TTD: దర్శన విధానంలో మార్పులు, అన్న ప్రసాదం పై ఈవో కీలక ప్రకటన..!!
Tirumala: తిరుమలలో భక్తులకు దర్శనం... సౌకర్యాల మెరుగుదల కోసం టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా మార్పులు చేస్తోంది. సాంకేతికత ను వినియోగించి దర్శనం మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది. అదే విధంగా తాజాగా అంగ ప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలోనూ మార్పులు తీసుకొచ్చింది. ఇక.. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి వేళ శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం పైన నిర్ణయం తీసుకుంది. తాజాగా.. టీటీడీలో చేపట్టనున్న కీలక నిర్ణయాలను ఈవో అనీల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.
తిరుమలలో ఏఐ వినియోగం పైన అధికారులు కసరత్తు చేస్తున్నారు. సాంకేతికత వినియోగం ద్వారా త్వరగా శ్రీవారి దర్శనం భక్తులకు అందేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయం లో దర్శన విధానంలో మార్పులపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో అనీల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఇక.. టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో అన్న ప్రసాద వితరణ అమలు చేయనున్నట్లు చెప్పారు. ఇందు కోసం ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు. తిరుమల శ్రీవారిని అక్టోబర్ నెలలో 22.77 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఈవో తెలిపారు. అలాగే శ్రీవారికి హుండీ ద్వారా రూ.119.35 కోట్ల ఆదాయం వచ్చింద్నారు. అక్టోబర్ మాసంలో 1.23 కోట్ల లడ్డూల విక్రయం జరిగిందని.. 34.20 లక్షల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు. దాదాపు 8.31 లక్షల మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు టీటీడీ ఈవో తెలిపారు. గత పాలక మండలిలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని ఆయన అన్నారు.

అందులో భాగంగా ఆళ్వార్ ట్యాంక్ నుంచి గోగర్భం వరకు టాయిలెట్లు ఇతర ఖర్చుల కోసం రూ.25 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. అమరావతిలో శ్రీవారి ఆలయం పనులు పునః ప్రారంభించినట్లు చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్‌కు వచ్చే విరాళంలో ఆలయ నిర్మాణాల కోసం రూ.750 కోట్లు కేటాయించామని తెలిపారు. ఈనెల (నవంబర్) 17 నుంచి 25 వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలు సజావుగా సాగేలా అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శ్రీవారి భక్తులకు 10వ రోజున వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని అన్నారు. టికెట్లు ఎలా ఇవ్వాలి అనే అంశం గురించి పరిశీలిస్తున్నామని చెప్పారు. వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్లు ఎప్పుడు అందిస్తామనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications