కేసీఆర్‌ను ఏకేసిన ఎర్రబెల్లి, అరాచకం స్టార్ట్: డీకే అరుణ
హైదరాబాద్: ఉద్యమ పార్టీ అని చెప్పుకొన్న తెరాస డబ్బులు వెదజల్లి ఇతర పార్టీలక జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను కొనుగొలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు శనివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎంపీపీ, జడ్పీ అధ్యక్ష ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అప్రజాస్వామికంగా వ్యవహరించిందన్నారు. శనివారం చంద్రబాబు నివాసం వద్ద ఆయన విలేరులతో మాట్లాడారు.
సంతలో పశువులను కొన్నట్లుగా ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసి చైర్మన్ స్థానాలను గెలుచుకుందన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో తమ ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్‌లో చేరితే ఊరూవాడా గగ్గోలు పెట్టిన తెరాస ఇప్పుడు చేస్తున్న పనేమిటని ప్రశ్నించారు. దమ్ముంటే ఇతర పార్టీల నుండి చేర్చుకున్న సభ్యులందరితో రాజీనామాలు చేయించి, వారిని మళ్లీ పోటీ చేయించి నెగ్గాలని సవాల్ చేశారు.

తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అరాచకం మొదలైందని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ ధ్వజమెత్తారు. మహబూబ్ నగర్ జెడ్పీ ఎన్నిక అనంతరం ఆమె తన నివాసంలో మాట్లాడారు. రక్త సంబంధీకులైనా అవినీతికి పాల్పడితే ఉపేక్షించనని చెప్పిన కేసీఆర్ జెడ్పీ పీఠాలు దక్కించుకునేందుకు ఇతర పార్టీల సభ్యులను కొంటున్నారని, దీనిని అవినీతి కాక మరేమంటారని ప్రశ్నించారు.
దౌర్జన్యంగా, అప్రజాస్వామికంగా మహబూబ్ నగర్ జెడ్పీ ఎన్నిక జరిగిందన్నారు. ఎన్నిక నిర్వహణలో విఫలమైన జిల్లా కలెక్టరు తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రజాస్వామ్యంపై కేసీఆర్‌కు నమ్మకం ఉంటే పాలమూరు జెడ్పీ ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పట్లో ఎన్నికలు లేవని కేసీఆర్ ఇలాంటివి చేసినా.. ముందు ముందు ఆయన ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారని మల్లు రవి అన్నారు.












Click it and Unblock the Notifications