రైతు పూజోత్సవాన్ని ప్రకటించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
అమరావతి: ఇవ్వాళ ఏరువాక పౌర్ణమి. రైతులకు సంబంధించినంత వరకు అతిపెద్ద పండగ. దీన్నే జ్యేష్ఠ పౌర్ణమిగా పిలుస్తారు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించే సమయం. తొలకరి వర్షాలు పడే సందర్భం కావడం వల్ల రైతులు తమ పంట పొలాలను దుక్కి దున్నడానికి సిద్ధపడుతుంటారు. వ్యవసాయ పనులను మొదలు పెట్టడానికి ఏరువాక పౌర్ణమిని అత్యంత పవిత్రరోజుగా భావిస్తారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రైతాంగానికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలను తెలియజేస్తోన్నారు. పుడమి తల్లిని పూజించి వ్యవసాయ పనులు ప్రారంభించబోతోన్న రైతాంగానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ మేరకు ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సిరుల పంట పండాలని ఆకాంక్షించారు.

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ కీలక ప్రకటన చేశారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల రైతులను సన్మానించనున్నట్లు తెలిపారు. సామాజిక కార్యక్రమాలను నిర్వహించడానికి ఆయన ఇదివరకే జేడీ ఫౌండేషన్‌ను నెలకొల్పిన విషయం తెలిసిందే. ఈ ఫౌండేషన్ తరఫున రెండు తెలుగురాష్ట్రాల రైతాంగాన్ని సన్మనించనున్నామని అన్నారు. సమస్త మానవాళికి అన్నం పెట్టే రైతులను గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు.
ఏపీలోని వేర్వేరు జిల్లాల్లో రైతు పూజోత్సవం పేరుతో వాటిని నిర్వహించనుంది జేడీ ఫౌండేషన్. తూర్పు గోదావరి జిల్లా పిట్టలవేమవరం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట మండలం ఇరుసుమండ వంటి గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ప్రతి రైతును గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని, రైతు బాగుంటేనే అందరూ బాగుంటారని చెప్పారు.
లక్ష్మీనారాయణ ఇదివరకే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఆ తరువాత రాజకీయాల్లో పెద్దగా క్రియాశీలకంగా లేరు. జనసేన నుంచి కూడా బయటికి వచ్చారు. సామాజిక కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటోన్నారు లక్ష్మీనారాయణ. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించారు కూడా.
క్రౌడ్ పుల్లింగ్ ద్వారా నిధులను సమీకరించి- ఈ ప్లాంట్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్‌లో సైతం పాల్గొన్నారు. తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీకగా భావించే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడ్డుపడాలంటూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు పలు సూచనలూ చేశారాయన. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే 2,000 రూపాయల నోట్లను రద్దు చేయడాన్ని స్వాగతించారు. సకాలంలో రిజర్వు బ్యాంక్ ఈ చర్య తీసుకుందని, ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించాలన్నది తన ప్రధానమైన డిమాండ్ అంటూ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications