ఏమన్నారు: చిరు, జగన్, బాబు, కిరణ్‌లపై ఈటెల

తెలుగుదేశం పార్టీ సభ్యుడు అశోక్ గజపతి రాజు అభ్యంతరానికి రాజేందర్ సమాధానం ఇస్తూ - రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణపై కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పలేదా అని అడిగారు. తెలంగాణలో జెండా పీకేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గతంలో తెలంగాణ ఇచ్చే శక్తి గానీ ఆపే శక్తి గానీ తమకు లేదని, ప్రత్యేక తెలంగాణ ఇవ్వాల్సింది కేంద్రమేనని, ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రం తెలంగాణ ఇచ్చుకోవచ్చునని చెప్పిందని ఆయన అన్నారు. తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తున్నామని, అందరి మంచిని దృష్టిలో పెట్టుకోవాలని నిర్ణయం తీసుకోవాలని జగన్ అన్నారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు.
సచివాలయం సాక్షిగా తెలంగాణకు అనుకూలమని తెలుగుదేశం పార్టీ చెప్పిందని, తెలంగాణను ఎవరూ అడ్డుకోలేరని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ 41 మంది శాసనసభ్యుల సంతకాలతో వైయస్ రాజశేఖర రెడ్డి సోనియా గాంధీ వద్దకు వినతిపత్రం పంపించారని ఆయన అన్నారు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి ప్రయత్నించడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
తెలంగాణపై కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణకు అనుకూలంగా కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడెప్పుడు ఏ విధంగా మాట్లాడింది ఆయన వివరించారు. కెసిఆర్ దీక్ష సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే పార్టీ ప్రతినిధిగా తాను వెళ్లానని, తన విధి నిర్వహించానని చర్చిద్దామని తాను చెప్పానని అశోక్ గజపతి రాజు వివరణ ఇచ్చారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తెలంగాణపై పార్టీ తరఫున కమిటీ వేశారని, కమిటీ నివేదక ప్రకారం నిర్ణయం తీసుకున్న తర్వాత తెలంగాణకు అనుకూలంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభలో తీర్మానం పెడితే సహకరిస్తామని చెప్పారని, ఈ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకపోతే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం చేస్తామని చెప్పారని ఆయన అన్నారు. ఇప్పుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని విమర్శించడం సరి కాదని ఆయన అన్నారు.
తాము కుర్చీల కోసం, సీట్ల కోసం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోలేదని, తమ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత కట్టుబడి ఉంటామని, పార్టీయే కాకుండా తాను కూడా నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చంద్రబాబు చెప్పారని ఆయన అన్నారు. చిరంజీవి పార్టీ ఇప్పుడు లేదు గానీ అప్పుడు సామాజిక తెలంగాణకు తాము అనుకూలమని చిరంజీవి చెప్పారని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా చేసిన నిర్ణయాన్ని అన్ని పార్టీలో ఎన్నికల ప్రణాళికలో చేర్చాయని, ఆ పార్టీ ఎన్నికల ప్రణాళికల మీద గెలిచిన సభ్యులు అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు వ్యతిరేకించడం సరి కాదని ఆయన అన్నారు. పార్టీ ఎన్నికల ప్రణాళికలో పెట్టినప్పుడు ప్రణాళికలోని అంశాలను శాసనసభ్యులు గౌరవించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణను పెట్టినందుకు తాము పోటీ చేయబోమని ఒక్కసారైనా చెప్పారా అని అడిగారు. తెలంగాణ బిల్లును చించేసి, కాల్చిసే వెకిలి చేష్టలకు పాల్పడ్డారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications