ఓడినా ఆ నియోజకవర్గ ప్రజలకు ఆమె ఎమ్మెల్యే
వైసీపీ అధినేత , మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహిత నేతల్లో మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కూడా ఒకరు. జగన్ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన వెంటే ఉంది పుష్ప శ్రీవాణి ఫ్యామిలీ. 2014,2019 వరుస ఎన్నికల్లో పుష్ప శ్రీవాణి గెలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఎవరూ ఊహించని విధంగా పుష్ప శ్రీవాణికి డిప్యూటీ సీఎం పదవి అప్పగించి పెద్ద బాధ్యతలనే ఆమెపై పెట్టారు జగన్. తనకిచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడంలో పుష్ప శ్రీవాణి తనవంతు పాత్ర పోషించారు.
అయితే 2024 ఎన్నికల ఫలితాలు పార్టీతో పాటు పుష్ప శ్రీవాణికి సైతం పెద్ద షాకే ఇచ్చాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న పుష్ప శ్రీవాణి , తిరిగి పార్టీలో యాక్టివ్ అయ్యారు. కూటమి ప్రభుత్వంపై తనదైనశైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా పుష్పశ్రీవాణి తన భర్తతో కలిసి ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన రాజకీయ ఎంట్రీతో పాటు, ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలపై పుష్ప శ్రీవాణి స్పందించారు.

పుష్ప శ్రీవాణి తన వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ.. తన కాలేజీ రోజుల్లో తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌ని అని వెల్లడించారు. అయితే, ఇప్పుడు మాత్రం టాలీవుడ్‌లో తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్న అల్లు అర్జున్ ఫ్యాన్‌గా మారిపోయానని స్పష్టం చేశారు. ఒకప్పుడు పవన్‌ను అభిమానించిన ఆమె, ఇప్పుడు భిన్నమైన రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ, సినీ అభిమానం గురించి దాచుకోకుండా మాట్లాడటం విశేషం.
పుష్ప శ్రీవాణి భర్త పరీక్షిత్ రాజు తమ పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తి రేపాయి. మా పెళ్లి ఒక రకంగా జగనే చేశారంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ జీవితం గురించి మాట్లాడుతూ, 2014 ఎన్నికల్లో కాళ్ల పారాణి ఆరక ముందే తాము ఎన్నికలకు వెళ్లామని, ఆ ఎన్నికల్లో గెలిచామని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో ఆమె అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేలలో ఒకరుగా నిలిచారు.

2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమపై ఒత్తిడి పెరిగిందని, చాలామంది టీడీపీలో చేరాలని సూచించారని, కానీ మా జీవితంలో ప్రతీ అంశంలోనూ జగన్ ఉన్నారని, ఆయన్ను మోసం చేయడం ఇష్టలేక కష్టాలు ఎదురైనా, వైసీపీలోనే ఉన్నామని, జగన్ కూడా తమకు అంతకు మించిన గౌరవం ఇచ్చారని పరీక్షిత్ రాజు చెప్పుకొచ్చారు. డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని అసలు ఊహించలేదని ఆయన తెలిపారు. ఇప్పటికీ జగన్ మా గుండెల్లోనే ఉన్నారని, రాజకీయాలను వదిలేస్తాం కానీ,జగన్‌ను విడిచి వేరే పార్టీకి మాత్రం వెళ్లమని పరీక్షిత్ రాజు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇదే సమయంలో 2024 ఎన్నికల ఫలితాలపై పరీక్షిత్ రాజు సందేహాలు వ్యక్తం చేశారు.
పోలింగ్ రోజు 60 శాతం ఉన్న ఈవీఎం కౌంటింగ్ రోజుకు 90 శాతానికి ఎలా చేరిందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ, ఇప్పటికీ ప్రజల్లో తనపై ఉన్న అభిమానాన్ని పుష్ప శ్రీవాణి పంచుకున్నారు. తాను కొన్ని గ్రామీణ ప్రాంతాలకు వెళితే, అక్కడి ప్రజలు తననే ఎమ్మెల్యే అనుకొని వచ్చి తమ సమస్యలను వివరిస్తున్నారని, ఇది తనపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని ఆమె వెల్లడించారు. మొత్తంగా, మాజీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి , ఆమె భర్త ఇంటర్వ్యూ, వ్యక్తిగత జీవితం, సినీ అభిమానం, రాజకీయ ఎదుగుదల, అలాగే ప్రస్తుత ఎన్నికల ఫలితాలపై వారి అభిప్రాయాలను బలంగా తెలియజేసింది.












Click it and Unblock the Notifications