జనసేనకు జేడీ లక్ష్మీనారాయణ గుడ్ బై.. పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు.. టీడీపీలో చేరిక?
Recommended Video
అమరావతి రైతుల నిరసనలు, మూడు రాజధానుల వ్యవహారం, మండలి రద్దు తదితర అంశాలతో అట్టుడుకుతోన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్ట్ వాసగిరి లక్ష్మీనారాయణ అలియాస్ జేడీ లక్ష్మినారాయణ గురువారం జనసేన పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ తర్వాత నంబర్ 3గా కొనసాగుతోన్న ఆయన.. తన రాజీనామాకు సంబంధించి ఒక బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు.

శాశ్వతంగా విడిపోతున్నా..
ఏపీ ప్రజలకు ఎదో మంచి చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లో చేరానన్న జేడీ లక్ష్మీనారాయణ.. జన సేన ద్వారా తన లక్ష్యం నెరవేరే అవకాశాల్లేవని చెప్పారు. పార్టీ ప్రస్తుత పరిస్థితి, తన రాజీనామాకు దారితీసిన కారణాలను ఆయన పూసగుచ్చినట్లు వివరించారు. చర్చల ద్వారానో, ఒత్తిడి ద్వారానో మళ్లీ జనసేనలోకి తిరిగొచ్చే అవకాశమేలేదని, పవన్ కల్యాణ్ నుంచి శాశ్వతంగా విడిపోతున్నానని ఆయన పేర్కొన్నారు.

ఇవే కారణాలు..
‘‘ఒక సిద్ధాంతాన్ని నమ్మి.. దాన్నే ఆచరిస్తూ.. ఏదైనా పని చేపడితే దాన్ని పూర్తిచేసేవరకు నిద్రపోని వ్యక్తిగా నాకు పేరుంది. చాలా రకాలుగా ఆలోచించిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చాను. జీవితాంతం సిద్ధాంతానికి కట్టుబడి ఉంటానన్న పవన్ కల్యాణ్ తో కలిసి పనిచేయాలనుకున్నాను. కానీ పవన్ నిలకడలేని తనం నన్ను ఇబ్బంది పెట్టింది. మరీ ముఖ్యంగా.. పూర్తిస్థాయిలో రాజకీయాలకే పరిమితం అవుతానని, ఇకపై సినిమాలు చేయబోనని గట్టిగా ప్రకటించిన ఆయన.. ఇవాళ మాటతప్పడం జీర్ణించుకోలేకపోతున్నాను. పవన్ సినిమాల్లో నటించడం పట్ల నా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజీనామా చేస్తున్నా..''అని జేడీ తన లేఖలో పేర్కొన్నారు.

కొంతకాలంగా వార్..
ఎన్నికలకు ముందు జనసేనలో చేరిన జేడీ లక్ష్మీనారాయణ.. విశాఖపట్నం నుంచి పోటీచేశారు. ఒకదశలో ఆయన ఈజీగా గెలుస్తారని ప్రచారం జరిగినా.. చివరికి ఓడిపోకతప్పలేదు. ఎన్నికల తర్వాత పార్టీతో అంటీముంటన్నట్లు వ్యవహరిస్తున్న ఆయన.. చీఫ్ పవన్ కు క్రమంగా దూరమయ్యారు. కొంతకాలంగా పార్టీ నేతలకు, జేడీకి మధ్య వార్ నడుస్తున్నట్లు వార్తలొచ్చాయి. చివరికి జేడీ రాజీనామాతో పుకార్లకు బ్రేక్ పడినట్లయింది.

టీడీపీలో చేరతారా?
జేడీ జనసేనకు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరతారని గతంలో ప్రచారం జరిగింది. కానీ ఈలోపే పవన్ కల్యాణ్ నేరుగా బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు. ఇప్పుడు జనసేన నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించిన జేడీ లక్ష్మీనారాయణ.. తర్వాత ఏం చేయబోయేది నేరుగా వెల్లడించలేదు. దీంతో జేడీ టీడీపీతో కలుస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకటిరెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications