అమరావతి రింగ్ రోడ్ లో నేను బాధితుడినే - మాజీ మంత్రి నారాయణ..!!
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ స్కాం ఇప్పుడు రాజకీయ రచ్చగా మారుతోంది. ఇదే అంశం పైన గతంలో అమరావతి వ్యవహారాలు చూసిన మాజీ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. రింగ్ రోడ్ లో తాను భూమి కోల్పోయానని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అరెస్ట్ కుట్రగా పేర్కొన్నారు. టీడీపీ, జనసేన కలిసి నిర్ణయించిన కార్యాచరణ మేరకు ముందుకు వెళ్తామని స్పష్టం చేసారు. చంద్రబాబు మనో ధైర్యం కోల్పోలేదని వెల్లడించారు.
టీడీపీ అధినేత చంద్రబాబును నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, మాజీ మంత్రి నారాయణ రాజమండ్రి జైలులో కలిసారు. జైలులో చంద్రబాబు మనోధైర్యం కోల్పోలేదని నారాయణ పేర్కొన్నారు. స్వామి నాధన్ మరణం పై సంతాపం తెలపమని చెప్పారన్నారు. రాష్ట్రంలో మద్దతుగా తెలిపిన అన్ని పార్టీలు..ప్రజలకు ధన్యవాదాలు చెప్పారని నారాయణ వివరించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని పార్టీ శ్రేణులను కోరారని చెప్పారు. టీడీపీకి వస్తున్న ప్రజాదరణ అణచివేయాలని అధికార పార్టీ చూస్తోందని వ్యాఖ్యానించారు. కానీ, దాని వలన మ పార్టీకి ఆదరణ పెరుగుతోందని నారాయణ వివరించారు.

తమ పార్టీ ఆదరణ తగ్గదని నారాయణ స్పష్టం చేసారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని ఆరోపించారు. తన సొంత భూమి కూడా ఇన్నర్ రింగ్ రోడ్డులో పోయిందని నారాయణ చెప్పుకొచ్చారు.2001 లో ఈడ్పుగల్లులో కొన్న 40 సెంట్ల సొంత స్థలంగా వెల్లడించారు. దాని విలువ రూ 7 కోట్లుగా చెప్పారు. సొంత భూమినే పోగొట్టుకున్న తాను అవినీతి చేస్తానా అంటూ నారాయణ ప్రశ్నించారు. తమ పైన చేసిన ఆరోపణల్లో నిజాలు ఏంటో కోర్టులో తేలుతాయని చెప్పారు. టీడీపీ, జనసేన కమిటీలు ఇచ్చే నివేదిక ప్రకారం ఉమ్మడి కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతామని మాజీ మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పు ఇస్తారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications