పోలీసుల ఎదుట విచారణకు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. ఎందుకంటే!
సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని పాపిరెడ్డి పల్లిలో దారుణ హత్యకు గురైన పార్టీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించడానికి వెళ్ళిన క్రమంలో వైసిపి కార్యకర్తలు రెచ్చిపోవడానికి ,పోలీసుల పైన రాళ్లు ఇవ్వడానికి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కారణమని పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలో తాజాగా ఆయనను పోలీసులు విచారణ నిమిత్తం హాజరుకావాలని పిలిచారు.
సత్యసాయి జిల్లాలో ఏప్రిల్ లో జగన్ పర్యటనలో ఉద్రిక్తత
నేడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి శ్రీ సత్య సాయి జిల్లా సీకేపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసుల విచారణకు హాజరయ్యారు. సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని పాపిరెడ్డి పల్లి లో వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురైన నేపథ్యంలో జగన్ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు. జగన్ హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత పలువురు కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా దూసుకువెళ్లడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

పోలీసులపై రాళ్ళు.. జగన్ తీవ్ర వ్యాఖ్యలు
పలువురు కార్యకర్తలు పోలీసుల పైకి రాళ్ళు రువ్వారు. ఈ ఘటన తర్వాత జగన్ పోలీసులపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రామగిరి పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్ పోలీసులు తమ టోపీల పై ఉన్న సింహాలకు సెల్యూట్ కొట్టకుండా చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నారని, తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అలాంటి పోలీసుల బట్టలూడదీసి ప్రజల ముందు దోషిగా నిలబెడతాం అంటూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన రామగిరి ఎస్సై
ఇక ఈ క్రమంలో జగన్ వ్యాఖ్యలకు రామగిరి ఎస్సై సుధాకర్ ఘాటుగా స్పందించారు. ఖాకీ బట్టలు జగన్ ఇస్తే వేసుకునేవి కాదని కష్టపడి చదివి వేల మంది పోటీపడ్డ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి వేసుకునేవి అని ఆయన పేర్కొన్నారు. ఎవరో వచ్చి ఊడదీస్తా అంటే ఊడదీయటానికి అరటి తొక్క కాదని, తాము నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడతామని, అడ్డదారులు తొక్కబోమని, జగన్ జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు.
ఎస్సై వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కౌంటర్
ఇక ఎస్ఐ జగన్ పై చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఎస్సై చేసిన వ్యాఖ్యల పైన ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు కోసమే రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.జగన్ ను విమర్శించే స్థాయి ఎస్సై సుధాకర్ యాదవ్ కు లేదని తోపుదుర్తి వ్యాఖ్యానించారు.
తోపుదుర్తిపై కేసు.. నేడు విచారణకు హాజరైన తోపుదుర్తి
ఇక ఆ తర్వాత జగన్ భద్రత పైన తాము చేసిన సూచనలను తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పెడచెవిన పెట్టారని పోలీసులు వ్యాఖ్యానించారు. తోపుదుర్తి మాటలతో రెచ్చిపోయిన కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వారని, దీంతో కొందరు పోలీసులకు గాయాలయ్యాయని దర్యాప్తులో తేలినట్టు పోలీసులు వివరించారు. ఇక కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పైన కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు రావాలని నోటీసులు పంపించారు. ఈ క్రమంలోనే నేడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications