బంగారంతో నేశారు: శ్రీనివాసుడికి రూ.కోట్ల విలువ చేసే అపురూప కానుక
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన బుధవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం నుంచి మంగళవాయిద్యాల మధ్య ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆయనకు స్వాగతం పలికారు. ఆ తరువాత ముఖ్యమంత్రి శ్రీవారిని దర్శించుకున్నారు.
వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. టీటీడీ చైర్మన్, ఈవో చంద్రబాబుకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తో కలిసి చంద్రబాబు స్వామి వారి పెద్దశేష వాహన సేవలో పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారికి ఓ అరుదైన కానుక అందింది. స్వర్ణ యజ్ఞోపవీతాన్ని టీటీడీకి విరాళంగా అందించారు ఓ భక్తుడు. స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసిన యజ్ఞోపవీతం అది. అందులో ఉన్న పోగులను బంగారంతో నేశారు. వజ్రాలను పొదిగారు. దీని బరువు 3 కేజీల 860 గ్రాములు. విలువ 3.86 కోట్ల రూపాయలు.
విశాఖపట్నానికి చెందిన హిందుస్థాన్ ఎంటర్ ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ పువ్వాడ మస్తాన్ రావు, ఆయన భార్య కుంకుమ రేఖ ఈ యజ్ఞోపవీతాన్ని టీటీడీకి విరాళంగా అందించారు. స్వామివారికి కానుకగా అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా దీన్ని తయారు చేయించారు. ఈ మేరకు దాతలు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు దీన్ని అందజేశారు. టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మీ, భాను ప్రకాష్ రెడ్డి, నరేష్ కుమార్, శాంతారామ్ ఇందులో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications