కొండపిలో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో టీడీపీ ఎమ్మెల్యే
ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నాయుడుపాలెంలో తీవ్ర ఉద్రిక్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి ఇంటిని ముట్టడించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వరికూటి అశోక్‌బాబు నేతృత్వంలో వీరంతా కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని.. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో డోలా ఇంటిని ముట్టడించేందుకు టంగుటూరులోని వైసీపీ కార్యాలయం వద్దకు పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో దాదాపు అక్కడ 350 మంది పోలీసులను మొహరించారు. వైసీపీ తీరును నిరసిస్తూ టీడీపీ నాయకులు టంగుటూరులోని అశోక్‌బాబు ఇంటిని ముట్టడించేందుకు బయలుదేరారు.

ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో బయలుదేరారు. 16వ నెంబర్ హైవేపై మార్గమధ్యంలోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులకు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యే డోలా జాతీయ రహదారిపై బైఠాయించారు. తర్వాత పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని అక్కడినుంచి తరలించారు. పోలీసులు పక్షపాత వైఖరిని చూపిస్తున్నారంటూ టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య పలు వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతోపాటు అనంతపురం జిల్లాల్లో కొన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే పోలీసులు తమకు నిరసన తెలియజేసే హక్కును కూడా కాలరాస్తున్నారని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ ఇంకెన్ని ఉద్రిక్త పరిస్థితులు రాష్ట్రవ్యాప్తంగా నెలకొంటాయోననే ఆందోళనను ప్రజాస్వామికవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications