10 భాగాలుగా మహాభారతం: రాజమౌళి
అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళికి ఒక కలల ప్రాజెక్టు ఉంది. ఇతిహాసగాథ మహాభారతాన్ని తీయాలనేది ఆయన లక్ష్యం. ఎప్పటికైనా ఆ సినిమా తీస్తానని గతంలో పలుమార్లు చెప్పారు. తాజాగా మరోసారి అదే విషయాన్ని స్పష్టం చేశారు. తాను 'మహాభారతం' తీస్తే బహుశా పది భాగాలు ఉంటుందేమోననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
రాజమౌళి ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో మీరు మహాభారతం తీస్తానన్నారు.. అద్భుతమైన కథ 266 ఎపిసోడ్స్ గా వచ్చిందని, మీరు మహాభారతాన్ని తీయాలనుకుంటే ఎన్ని భాగాలుగా తీస్తారని ప్రశ్నించారు. దానికి రాజమౌళి స్పందిస్తూ తనకు కూడా దీనిపై స్పష్టత లేదని, ఒకవేళ తీయాల్సి వస్తే అందుబాటులో ఉన్న వెర్షన్స్ చదవడానికే సంవత్సరం పైగా సమయం పడుతుందని, అప్పటికి కూడా ఒక్క అక్షరం కూడా పేపరుపై పెట్టలేకపోవచ్చన్నారు. తాను మహాభారతం తీయాల్సి వస్తే 10 భాగాలు తీయాల్సి వస్తుందేమోనని ఊహిస్తున్నానన్నారు. అయితే కచ్చితంగా ఎన్ని భాగాలవుతుందో చెప్పలేనన్నారు.

గతంలోను మహాభారతంపై రాజమౌళి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. భారతీయ కథలను ప్రపంచానికి చెప్పాలని, మహాభారతం అనేది తన చిరకాల ప్రాజెక్టు అని, అయితే ఆ మహాసముద్రంలోకి అడుగుపెట్టడానికి సమయం పడుతుందన్నారు. అంతకన్నా ముందుగా మరో నాలుగైదు సినిమాలు తీస్తానన్నారు.
ప్రస్తుతం ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా రాజమౌళి ఒక సినిమా తీయాలంటే దాదాపు మూడు సంవత్సరాలు పడుతోంది. ఈ లెక్కన ఆయన మహాభారతం తీయడానికి 10 నుంచి 12 సంవత్సరాలు పట్టొచ్చు. 'ఆర్‌ఆర్‌ఆర్'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రాజమౌళి తర్వాత ప్రాజెక్టు మహేష్ బాబుతో చేస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ కథతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.












Click it and Unblock the Notifications