మా అబ్బాయి మోక్షజ్ఞ నామకరణం ఇక్కడే జరిగింది: బాలకృష్ణ
హైదరాబాద్ లోని ప్రముఖ సినిమా థియేటర్లలో ఒకటైన 'తారకరామ' పునఃప్రారంభమైంది. 'ఏషియన్ తారకరామ' రుతో కొత్త హంగులు సంతరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సరికొత్తగా రూపుదిద్దుకున్న ఈ థియేటర్ ను కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తారకరామ థియేటర్ కు గొప్ప చరిత్ర ఉందని, అది తమకు దేవాలయంతో సమానమని చెప్పారు. తమ తల్లి బసవతారకం జ్ఞాపకార్థం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించామని, థియేటరైనా, ఆసుపత్రైనా తమకు దేవాలయంతో సమానమని చెప్పారు.
ఈ థియేటర్ కు పెద్ద చరిత్ర ఉందని, అమ్మ, నాన్నల పేర్లు కలిసి వచ్చేలా 1978లో దీన్ని ప్రారంభించామన్నారు. 'అక్బర్ సలీం అనార్కలి'తో మొదలై కొన్ని అనివార్య కారణాలవల్ల నిలిచిపోయింది. తిరిగి 1995లో పున: ప్రారంభించామని, నేటి టెక్నాలజీకి అనుగుణంగా మూడోసారి దీన్ని రీమోడల్ చేసి ప్రజల ముందుకు తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. డాన్ సినిమా ఇక్కడ 525 రోజులు ఆడిందని గుర్తుచేశారు. దాంతోపాటు తన సినిమాలకు చాలా ఇక్కడ శతదినోత్సవాలు చేసుకున్నాయన్నారు.

ఈ థియేటర్ తో తనకు సెంటిమెంట్ ఎక్కువని, అబ్బాయి మోక్షజ్ఞ తారక రామ తేజ నామకరణాన్ని ఎన్టీఆర్ ఈ థియేటర్ లోనే చేశారన్నారు. ఏషియన్ సినిమాస్ సంస్థతో తమకు మంచి సంబంధాలున్నాయని, వారితో కలిసి ఏషియన్ తారకరామ ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. మంచి కథలతో చిత్ర పరిశ్రమ మరింతగా దినదినాభివృద్ధి పొందాలన్నారు.
సుపీరియర్ సౌండ్ సిస్టమ్, 4కే ప్రొజెక్షన్‌తోపాటు సీటింగ్‌లోనూ మార్పులు చేశారు. 975 సీటింగ్ కెపాసిటీ కలిగిన థియేటర్‌ను సరికొత్త అనుభూతి కోసం 590కి తగ్గించారు. రెక్లైనర్, సోఫాలను అందుబాటులోకి తెచ్చి 16వ తేదీ నుంచి హాలీవుడ్ చిత్రం 'అవతార్2'ను ప్రదర్శించనున్నారు












Click it and Unblock the Notifications