డుండీ గణేష్ వివాదం: 'లైసెన్స్ ఉన్న రౌడీలా బొండా ఉమా వ్యవహరిస్తున్నారు'
అమరావతి: బెజవాడ డుండీ గణేష్ సేవా సమితి ఉత్సవాల్లో వివాదం, అధ్యాత్మిక కార్యక్రమాల్లో తలదూర్చి ఉత్సవాలను వివాదాస్పదంగా మార్చడంతో పాటు ప్రముఖ పారిశ్రామిక వేత్త కోగంటి సత్యంను ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఏకపక్షంగా వ్యవహరించి అరెస్ట్ చేయించిన తీరుపై బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
బొండా ఉమా ఫిర్యాదు: బెజవాడ పారిశ్రామికవేత్తపై హత్యాయత్నం కేసు!
డుండీ గణేష్ సేవా సమితి వివాదంపై బీజేపీ యువమోర్చా నగర అధ్యక్షుడు చిన్నపురెడ్డి రవీంద్రరెడ్డి స్పందించారు. కృష్ణలంకలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు జాగీర్ కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

రాష్ట్రంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే డుండీ గణేష్ సేవా సమితి గౌరవ అధ్యక్షుడిగా భాద్యలు నిర్వహిస్తున్న కోగంటి సత్యంపై అసత్య ఆరోపణలు చేసి ఆరెస్ట్ చేయించడం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు. అధికారాన్ని అడంపెట్టుకుని ఒక లైసెన్స్ ఉన్న రౌడీలా ఎమ్మెల్యే బొండా ఉమా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
బొండా ఉమాకు అసలు ఏం సంబంధం ఉందని ఈ విషయంలో తల దూర్చారని ప్రశ్నించారు. బొండా ఉమా ముందు తన కుమారులను అదుపులో పెట్టుకోవాలని, వారు మంచి బాటలో నడిచేవిదంగా చూడాలని ఆయన హితవుపలికారు. కాగా డుండీ గణేష్ సేవా సమితి మీద ఆధిపత్యం కోసం బొండా ఉమా, కోగంటి సత్యం వర్గాల మధ్య మొదలైన వివాదం చినికి చినికి గాలివానగా మారిన సంగతి తెలిసిందే.
డుండీ గణేశ్ సేవా సమితి గౌరవ అధ్యక్ష పదవి నుంచి కోగంటి సత్యాన్ని తొలగించి, ఆ పదవిలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కట్టబెడుతూ కమిటీ రిజిస్ట్రేషన్ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది సేకరించిన వారాళాల్లో రూ. 30 లక్షలను కోగంటి సత్యం స్వాహా చేశారని బొండా ఉమా ఆరోపిస్తున్నారు.
డుండీ గణేష్ సేవా సమితిలో జరిగిన అవకతవకలపై కోగంటి సత్యంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో కోగంటి సత్యం వర్గీయుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఉమా వర్గానికి చెందిన రాకేష్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోగంటి సత్యాన్ని విచారణకు పిలిపించిన సూర్యారావుపేట పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోగంటిపై హత్యాయత్నం ఆరోపణల కింద ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు.
బ్రేకింగ్ న్యూస్, న్యూస్ అలర్ట్‌ల కోసం వన్ఇండియా తెలుగు న్యూస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి












Click it and Unblock the Notifications