ఏపీలో ఆ పార్టీదే అధికారం: ఓటర్ పల్స్ ఇదే: తేల్చేసిన లేటెస్ట్ సర్వే
AP Assembly elections survey 2024: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రణరంగానికి సిద్ధమైంది. ఇదివరకు నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలకు కొనసాగింపుగా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. 175 నియోజవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసుకున్నారు.
మేమంతా సిద్ధం..
దీనికి మేమంతా సిద్ధం అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బస్సు యాత్ర పనుల్లో తీరిక లేకుండా గడుపుతోంది వైఎస్ఆర్సీపీ. గడువు సమీపిస్తోండటంతో కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిదలిచిన బహిరంగ సభ ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తోంది. 175కు 175 స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

కూటమి సర్వశక్తులు
వైఎస్ఆర్సీపీని ధీటుగా ఎదుర్కొనడానికి అటు తెలుగుదేశం పార్టీ సర్వశక్తులనూ ఒడ్డుతోంది. ఇందులో భాగంగా జనసేన, భారతీయ జనతాపార్టీలతో పొత్తు పెట్టుకుంది. కూటమిగా ఆవిర్భవించింది. ఉమ్మడి ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ పరిస్థితుల్లో 2019 నాటి ప్రభంజనాన్ని వైఎస్ఆర్సీపీ మళ్లీ సృష్టించగలదా అనేది ఆసక్తికరంగా మారింది.
సర్వే ఏం చెబుతోంది?
ఈ అంశంపై ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. పోల్ స్కాన్ సర్వే పేరుతో దీన్ని చేపట్టింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే చేపట్టింది. అక్కడ ఎలాంటి రాజకీయ వాతావరణం ఉందనే విషయాన్ని సేకరించింది. ఈ ఎన్నికల సందర్భంగా ఓటర్లు ఎవరిని ఎన్నుకుంటారనే విషయంపై తన అంచనాలను వెల్లడించింది.
సేకరణ ఇలా..
ఈ సర్వే కోసం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 2,24,500 మంది ఓటర్ల మనోగతాన్ని తెలుసుకుంది. ఇందులో 1,09,500 మందిని ఆ సంస్థ ప్రతినిధులు వ్యక్తిగతంగా కలిశారు. మిగిలిన 1,15,000 మంది నుంచి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా అభిప్రాయాలను సేకరించింది.
ఈ అంశాల ఆధారంగా..
ప్రభుత్వ పాలన, స్థానిక ఎమ్మెల్యే పనితీరు, నియోజకవర్గంలో ఉన్న రాజకీయ స్థితిగతులు, మౌలిక సదుపాయాలు, ప్రజలకు ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాల ఫలాలు.. వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుందా సంస్థ. వాటన్నింటినీ క్రోడీకరించిన అనంతరం ఫలితాలను విడుదల చేసింది.

వైసీపీదే హవా..
ఈ సర్వే ప్రకారం చూస్తే- ఏపీలో మరోసారి వైఎస్ఆర్సీపీ విజృంభణ ఖాయం. 120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ విజయఢంకా మోగిస్తుంది. ఆయా నియోజకవర్గాలన్నింట్లో వైఎస్ఆర్సీపీ అత్యంత బలంగా ఉంది. మొత్తం 175 నియోజకవర్గాలకు గాను 120 చోట్ల పకడ్బందీ ఓటుబ్యాంకును వైసీపీ సృష్టించుకోగలిగింది. 120 స్థానాలతో వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తుంది.
కూటమికి దక్కేవెన్ని..?
ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమికి 44 స్థానాలకు పరిమితమౌతుంది. ఆయా నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారు. మిగిలిన 11 నియోజకవర్గాల్లో వైసీపీ- కూటమి అభ్యర్థుల మధ్య హోరాహోరి పోరు ఉంటుంది. వైసీపీకి 50.1 శాతం మేర ఓట్లు పోల్ అవుతాయి. ఇది 2019 కంటే అధికం. టీడీపీ కూటమికి పడే ఓట్ల శాతం 47.2. ఇతరులకు 2.7 శాతం మేర ఓట్లు పడతాయి.
లోక్‌సభలో..
అలాగే 18 లోక్‌సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు బావుటా ఎగురవేస్తుంది. టీడీపీ కూటమి విజయం సాధించేది రెండు లోక్‌సభ స్థానాలే. మిగిలిన అయిదు చోట్ల వైఎస్ఆర్సీపీ- కూటమి మధ్య తీవ్ర పోరు నెలకొని ఉంటుందని ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ సంస్థ అభిప్రాయపడింది. ఈ అంచనాలు, సర్వేలు ఎంతవరకు నిజం అవుతాయనేది జూన్ 4వ తేదీన తేలిపోతుంది.












Click it and Unblock the Notifications