టీడీపీలోకి వచ్చిన నేతలు తిరిగి వైసీపీలోకి, మారుతున్న లెక్కలు..!!
నెల్లూరు కేంద్రంగా రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. నెల్లూరు మేయర్ పీఠం పైన కూటమి నేతలు ఫోకస్ చేసారు. మేయర్ పైన అవిశ్వాసం ప్రతిపాదించారు. ఈ నెల 16న అవిశ్వాస తీర్మానానికి ముహూర్తం గా ఫిక్స్ చేసారు. ఇదే సమయంలో లెక్కలు మారుతున్నాయి. వైసీపీ వీడిన కార్పోరేటర్లు తిరిగి సొంత గూటికి చేరారు. మాజీ మంత్రి అనిల్ వారితో కలిసి మాజీ సీఎం జగన్ ను కలిసారు. దీంతో.. ఇప్పుడు నెల్లూరులో ఏం జరుగుతుందనే ఉత్కంఠ పెరుగుతోంది.
ఒకప్పుడు వైసీపీకి కంచుకోటగా నిలిచిన నెల్లూరులో లెక్కలు మారుతున్నాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. నెల్లూరు కార్పోరేషన్ లోనూ పాగా వేసేందుకు కూటమి నేతలు పావులు కదిపారు. మేయర్ పైన అవిశ్వాసానికి సిద్దమయ్యారు. వైసీపీ కార్పోరేటర్లు టీడీపీలో చేరటంతో ఇక మేయర్ సీటు కూటమికి దక్కుతుందని అంచనా వేసారు.

ఇంతలో మాజీ మంత్రి అనిల్, రూరల్ ఇంఛార్జ్ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనూహ్యంగా పార్టీ మారిన వారితో మంత్రాంగం నడిపారు. అయిదుగురు కార్పోరేటర్లు తిరిగి వైసీపీలోకి వచ్చారు. వారితో ఈ ఇద్దరు నేతలు మాజీ సీఎం జగన్ ను కలిసారు. తాము వైసీపీలోనే కొనసాగుతామని వారు తేల్చి చెప్పారు. అటు 16వ తేదీన అవిశ్వాసానికి సిద్దం అవుతున్న టీడీపీ నేతలకు ఈ పరిణామం షాక్ గా మారింది.
దీంతో.. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీకి మద్దతుగా 39 మంది కార్పోరేటర్లు ఉన్నారు. మరో ఇద్దరు జారినా అవిశ్వాసం వీగిపోతుంది. దీంతో.. టీడీపీ నేతలు అలర్ట్ అయ్యారు. మిగిలిన వారు జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు వైసీపీ సైతం తమ మద్దతు కార్పోరేటర్లతో క్యాంపు ఏర్పాటు చేసింది. టీడీపీ సైతం తమకు మద్దతు ఇస్తున్న వారిని క్యాంపు కు తరలించింది.

అవిశ్వాసానికి ఇంకా అయిదు రోజుల సమయం ఉంది. దీంతో.. ఏ నిమిషం ఎలాంటి పరిణామం చోటు చేసుకుంటుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. తాజాగా కడప కార్పోరేషన్ ను వైసీపీ నిలబెట్టుకుంది. నెల్లూరును అదే విధంగా కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. అటు కూటమి నెల్లూరు అవిశ్వాసం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీంతో.. నెల్లూరు కేంద్రంగా ఈ అయిదు రోజుల రాజకీయం పైన ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications