రేప్, హత్య: నమ్మి అశ్రయమిచ్చినందుకు చిన్నారిని చిదిమేశాడు
చిత్తూరు: నమ్మి ఆశ్రమిచ్చినందుకు ఓ నీచుడు అత్యంత కిరాతకమైన చర్యకు పాల్పడ్డాడు. తెలిసినవాడని చెప్పి ఇంట్లో ఆశ్రయమిస్తే ఆ ఇంటి దీపాన్ని ఆర్పేశాడు. అయిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను హత్య చేశాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం తగ్గువారిపల్లెలో జరిగింది.
కుమార్, కుట్టెమ్మ దంపతులకు చిత్తూరు రూరల్ మండలం తుమ్మిందపాళ్యానికిచెందిన యానాది స్వామినాథన్ తెలుసు. తాను పనిమీద వచ్చానని గురువారం రాత్రికి తనకు వారి ఇంట్లో ఆశ్రయం ఇవ్వాలని కోరాడు. అందుకు కుమార్ అంగీకరించాడు.

కుమార్, కుట్టేమ్మ దంపతులకు నలుగురు పిల్లలు. గురువారం సాయంత్రం భార్యాభర్తలు, పిల్లలతో పాటు స్వామినాథ్ మొదటి సినిమా(ఫస్ట్ షో) చూసేందుకు బంగారుపాళ్యం వెళ్లారు. సినిమా వదిలే సమయానికి నలుగురు పిల్లలు నిద్రించడంతో.. స్వామినాథ్‌కు ఓ బాలికను అందించి ఇంటికి ఎత్తుకురావాలని ఆ తల్లిదండ్రులు సూచించారు. మార్గమధ్యంలో స్వామినాథ్ బాలికతో పాటు అదృశ్యమయ్యాడు.
అర్ధరాత్రి దాటుతున్నా కూడా సోమనాథ్ చిన్నారిని ఇంటికి తీసుకురాకపోవడంతో తల్లిదండ్రులు పరిసరాల్లో గాలించారు. ఫలితం లేకపోవడంతో ఎస్సై నెట్టి కంఠయ్యకు ఫిర్యాదు చేశారు. ఎస్సై తన సిబ్బందితో బంగారుపాళ్యం పరిసర ప్రాంతాల్లో గాలించినా బాలిక జాడ లభించలేదు. శుక్రవారం ఉదయం బాలిక స్థానికంగా ఓ కాలువ వద్ద శవమై ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలికి చేరుకున్న ఎస్సై అదృశ్యమైన బాలిక తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. కాలువ వద్దకు చేరుకున్న వారు మృతిచెందింది తమ కూతురేనని గుర్తించారు. నిందితుడు బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో గొంతు నులిమి హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు.
వెంటనే అప్రమత్తమై బంగారుపాళ్యంలో నిందితుడు స్వామినాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పలమనేరు డీఎస్పీ శంకర్, గంగవరం సీఐ రవికుమార్ ఘటనా స్థలిని పరిశీలించారు. శవ పంచనామా నిమిత్తం బాలిక మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేసి నిందితుడ్ని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications