హ్యాట్సాఫ్ సీఎం సర్ - విజయవాడలో పవన్ అభిమానుల ఫ్లెక్సీ : రంగా - రాధా ఫొటోలతో..!!
ఏపీలో ఇప్పుడు భీమ్లానాయక్ సినిమా విడుదల అంశం రాజకీయ వివాదంగా మారింది. ప్రభుత్వం పవన్ నటించిన భీమ్లానాయక్ సినిమా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవటం.. సినిమా థియేటర్లకు నోటీసులు ఇవ్వటం పైన రాజకీయంగా విమర్శలు మొదలయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు.. లోకేష్ తో సహా బీజేపీ నేతలు సైతం ప్రభుత్వ తీరును తప్పు బట్టారు. పవన్ పైన కక్ష్యతో ఇండస్ట్రీని వేధిస్తున్నారంటూ విమర్శలు వినిపించాయి. ఇక, ప్రభుత్వం నుంచి కౌంటర్ ఇచ్చారు.
Recommended Video

భీమ్లానాయక్ వివాదం
మంత్రి మేకపాటి మరణంతో జీవో జారీ ఆలస్యం అయిందంటూనే...పవన్ తన సినిమాలు ఉచితంగా వేస్తానని చెప్పారుగా అని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. మరో మంత్రి బొత్సా.. సినిమా విడుదల వాయిదా వేసుకోవాల్సిదంటూ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఇప్పుడు విజయవాడలో తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ ఫ్లెక్సీని పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఏర్పాటు చేయడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. భీమ్లానాయక్ కు తెలంగాణలో అయిదో షో ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెండు వారాల పాటు ఈ వెసులుబాటు కలిగించింది. ఏపీలో బెనిఫిట్ షో కు అనుమతి ఇవ్వకపోవటంతో పవన్ అభిమానులు పలు ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేసారు.

కేసీఆర్ ఫ్లెక్సీ.. థాంక్స్ చెబుతూ
దీంతో..ఏపీలోనూ పవన్ అభిమానులు తెలంగాణ సీఎం కేసీఆర్ పైన తమ అభిమానం చాటుకున్నారు. ఐదో షోకు అనుమతులు ఇవ్వడాన్ని స్వాగతిస్తూ ..కేసీఆర్ ఫొటోతో హ్యాట్సాఫ్ సీఎం అంటూ విజయవాడ కృష్ణలంకలోని ఫైర్ స్టేషన్ సమీపంలో భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. పవన్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం కేసీఆర్ ఫోటోతో పాటు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫోటోలు కూడా ఉన్నాయి. మరోవైపు ఫ్లెక్సీపై వంగవీటి రంగా, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ఫోటోలను కూడా పవన్ అభిమానులు ముద్రించారు. ప్రస్తుతం ఈ ప్లెక్సీ విజయవాడలో చర్చనీయాంశంగా మారింది. ఏపీలో ఆంక్షలతో ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వానికి కౌంటర్‌గానే ఈ ఫ్లెక్సీ విజయవాడ నడి బొడ్డున ఏర్పాటు చేసినట్లుగా భావిస్తున్నారు.

వంగవీటి ఫొటోలతో పాటుగా - రాజకీయంగా చర్చ
విడుదల అయిన రోజునే భీమ్లానాయక్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఏపీకి చెందిన పలువురు అటు యానాం..ఇటు తెలంగాణలో సినిమా ను ముందుగా చూసేందుకు వెళ్లినట్లుగా తెలిసింది. ఏపీలో సినిమా సమస్యల పరిష్కారం పైన చర్చించిన మెగాస్టార్ చిరంజీవి టీం సీఎం జగన్ అన్నింటి పైనా సానుకూలంగా స్పందించారని.. అయిదో షో కు సైతం అంగీకారం తెలిపారని చర్చల తరువాత హీరోలు చెప్పుకొచ్చారు. అయితే, ఆ నిర్ణయాలకు సంబంధించి ఇంకా అధికారికంగా జీవో విడుదల కాలేదు. దీంతో..పాత టికెట్ ధరలు..గతంలో తీసుకున్న నిర్ణయాల మేరకే భీమ్లా విడుదలకు నిబంధనలు అమలు చేసారు. ఇక, ఇప్పుడు ఏపీలో పవన్ అభిమానులు కేసీఆర్ ఫొటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ..అందులో రంగా - రాధా ఫొటోలు ఏర్పాటు చేయటం రాజకీయంగానూ కొత్త సమీకరణాలకు కారణంగా నిలుస్తోంది. భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ మంత్రులు కేటీఆర్.. తలసాని సైతం హాజరయ్యారు.












Click it and Unblock the Notifications