జగన్‌కు సీబీఐ మాజీ జేడీ ప్రార్థన
అమరావతి: భారత్ రాష్ట్ర సమితి అధిష్ఠానం- ఇక ఏపీలో క్రియాశీలక రాజకీయాల్లో ప్రత్యక్షంగా అడుగు పెట్టబోతోన్నట్టే కనిపిస్తోంది. రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను నియమించిన తరువాత పెద్దగా ఎలాంటి కార్యక్రమాలనూ నిర్వహించట్లేదు బీఆర్ఎస్. సంక్రాంతి నాటికి కొత్త పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారనే వార్తలొచ్చినప్పటికీ అది కూడా వాస్తవరూపాన్ని దాల్చలేకపోయింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో- ఇప్పటి నుంచే ఏపీలో పాగా వేయడానికి కసరత్తు మొదలుపెట్టింది.
ఈ క్రమంలో అత్యంత కీలకమైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంశాన్ని తీసుకుంది బీఆర్ఎస్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాయడం ఆసక్తిగా మారింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనలను నిరసిస్తూ ఇప్పటికే ఏపీలోని అన్ని పార్టీలు కూడా తమ నిరసనలను తెలియజేశాయి. ఆందోళనలను చేపట్టాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం రోడ్డెక్కిందీ విషయంలో.

తాజాగా కేటీఆర్ ఈ విషయంపై స్పందించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. దీన్ని తాము వ్యతిరేకిస్తోన్నామని స్పష్టం చేశారు. రిలే నిరాహార దీక్షలు చేస్తోన్న విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులకు సంఘీభావం తెలపాలని ఆయన తమ పార్టీ ఏపీ రాష్ట్రశాఖ నాయకులకు సూచించారు. ప్రైవేటు కంపెనీలకు లబ్ది కలిగించడానికే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో వంద శాతం పెట్టుబడులను ఉపసంహరించుకోడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు.
కేటీఆర్ రాసిన లేఖ.. ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమౌతోంది. దీనిపై సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆయన తీసుకున్న ఈ చర్యను తాను స్వాగతిస్తోన్నానని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఆయన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒకట్రెండు సూచనలు కూడా చేశారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం గనక వెనక్కి తగ్గకుంటే.. తెలంగాణ ప్రభుత్వం ముడి సరుకు సరఫరా, వర్కింగ్ క్యాపిటల్‌ను అందించే బిడ్‌లో పాల్గొనాలని జేడీ లక్ష్మీనారాయణ సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే వైఖరిని అనుసరించాల్సి ఉంటుందని సూచించారు. ఏపీ ప్రభుత్వం కూడా ఇదే బిడ్ లో పాల్గొనాలని వైఎస్ జగన్‌ను ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి @KTRBRS స్పందన హర్షణీయం. కేంద్రం వెనక్కి తగ్గకుంటే , తెలంగాణ ప్రభుత్వం ముడిసరుకు సరఫరా & వర్కింగ్ క్యాపిటల్‌ను అందించే బిడ్‌లో పాల్గొనాలి. @ysjagan కూడా ఇదే వైఖరిని తీసుకోవాలని ప్రార్థన. @BRSharish pic.twitter.com/R7U1Cr45se
— V. V. Lakshmi Narayana , A+ (JD) (@VVL_Official) April 2, 2023
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముడి పదార్థాల సరఫరా, ప్లాంట్ నిర్వహణకు అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ కోసం ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటెరెస్ట్) కేంద్ర ప్రభుత్వం జారీ చేసిందని జేడీ లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. ప్రైవేట్ కంపెనీల ప్రవేశాన్ని నిరోధించడానికి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఏపీ, తెలంగాణ లేదా ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ బిడ్డింగ్ లో పాల్గొనాల్సి ఉంటుందని సూచించారాయన.












Click it and Unblock the Notifications