ఏపీలో బీఆర్ఎస్ చీఫ్‌గా పవన్ కల్యాణ్ రైట్ హ్యాండ్- కాపు ఓటుబ్యాంక్ ..!!
అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏపీ రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. భారత్ రాష్ట్ర సమితి విస్తరణలో భాగంగా చేరికలకు గేట్లు ఎత్తేసినట్టే కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్‌ను విస్తరించడానికి చేస్తోన్న ప్రయత్నాల్లో భాగంగా ఏపీలో పెద్ద ఎత్తున ఇతర పార్టీలకు చెందిన నాయకులను ఆకర్షించే పనిలో పడ్డారు. ఏపీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు బీఆర్ఎస్ లో చేరడానికి సన్నద్ధమౌతున్నారు కూడా.

ఫ్లెక్సీలు.. బ్యానర్లతో
ఏపీలో- కేసీఆర్ కు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. దీన్ని సొమ్ము చేసుకునే దిశగా చర్యలు తీసుకుంటోన్నారు. బీఆర్ఎస్ ను నెలకొల్పినందుకు ఇప్పటికే ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీలో పలు చోట్ల భారీ బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. ఉత్తరాంధ్రతో పాటు కోస్తా జిల్లాల్లో పెద్ద ఎత్తున బ్యానర్లను ఏర్పాటు చేశారు ఆయన అభిమానులు. ఈ పార్టీకి ఘన స్వాగతం పలికారు. జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టిన వెంటనే ఏపీలో అనూహ్యంగా ఆదరణ లభిస్తోండటం బీఆర్ఎస్ అగ్ర నాయకుల్లో ఉత్సాహాన్ని నింపాయి.

ఏపీలోనూ..
దీనితో పాటు ఏపీలో పార్టీ కార్యకలాపాలను జోరుగా సాగించేలా పావులు కదుపుతున్నారు కేసీఆర్. దీనికి సంబంధించిన ఏర్పాట్లల్లో చురుగ్గా ఉంటోన్నారాయన. ఏపీలో పార్టీ కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేయబోతోన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన అద్దె భవనాన్ని కూడా కేసీఆర్ ఖరారు చేశారని చెబుతున్నారు ఆ పార్టీ నాయకులు.

తోట చంద్రశేఖర్ జాయినింగ్..?
అదే సమయంలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి తోట చంద్రశేఖర్- బీఆర్ఎస్ లో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని సోమవారమే ఆయన కేసీఆర్ ను కలుస్తారనే ప్రచారం సైతం ఊపందుకుంటోంది. లేదా సంక్రాంతి నాటికి చేరొచ్చనీ తెలుస్తోంది. కేసీఆర్, కేటీఆర్ సమక్షంలో తోట చంద్రశేఖర్.. బీఆర్ఎస్ కండువా కప్పుకొంటారని చెబుతున్నారు. ఈ సమాచారాన్ని బీఆర్ఎస్ ఇంకా నిర్ధారించాల్సి ఉంది.

కాపు ఓటుబ్యాంక్..
తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరితే- ఏపీలో బలమైన కాపు సామాజిక వర్గం ఓటుబ్యాంకును ప్రభావితం చేసేలా కేసీఆర్ తన తొలి నిర్ణయాన్ని తీసుకున్నట్టవుతుంది. కాపు సామాజిక వర్గానికి చెందిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి కావడం వల్ల కాపులతో పాటు విద్యావంతులు కూడా బీఆర్ఎస్ వైపునకు ఆకర్షితులవుతారని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా- ఏపీ బీఆర్ఎస్ అధ్యక్ష బాధ్యతలను తోటకు అప్పగించే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు.

వైసీపీ నుంచి..
తోట చంద్రశేఖర్ ఇదివరకు వైఎస్ఆర్సీపీలో పని చేశారు. 2014లో ఏలూరు లోక్ సభ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి.. టీడీపీ అభ్యర్థి మాగంటి బాబు చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత జనసేనలో చేరారు. క్రియాశీలకంగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు గానీ- చేదు ఫలితమే దక్కింది. ఇప్పుడిక బీఆర్ఎస్ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications