డ్రామాలు ఆడటంలో జగన్ ఫస్ట్, ఆ రోజు కనిపించలేదా ?
అధికారం దూరమైన తర్వాత జగన్ కు ప్రజల మీద ఎక్కడాలేని ప్రేమ పుట్టుకొస్తుందని, సీఎంగా ఉన్న సమయంలో తాడేపల్లి ప్యాలెస్ నుండి ఆయన కనీసం బయటకు రాలేదని, ఇప్పుడు ప్రజల మీద అంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందో మాకైతే అర్థం కావడంలేదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. జగన్ మాటలు వింటుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వుకుంటున్నారని ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎద్దేవ చేశారు.
తాడేపల్లి ప్యాలెస్ పక్కనే జరిగిన అత్యాచారం ఘటనపై జగన్ కనీసం కూడా మాట్లాడలేదని, ఇప్పుడు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న ఇలాంటి సంఘటనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేస్తున్నారని ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. జగన్ సీఎం గా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి సంఘటన ఎన్నో జరిగాయని, ఆ సమయంలో జగన్ ఎన్నిసార్లు స్పందించారు అనే విషయంలో వైసీపీ నాయకులు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.

జగన్ గుంటూరు పర్యటనపై మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ స్పందించారు. జగన్ అధికారంలోకి వచ్చిన ఆయన బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య గురించి ఏ మాత్రం స్పందించలేదని, కనీసం ఒక్క స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదని, దళితులు, బీసీలు, మైనార్టీలు హత్యకు గురైన సమయంలో జగన్ ఏ రోజు అయినా స్పందించారా అని ప్రశ్నించారు. సీఎం హోదాలో వాళ్ల దగ్గరికి వెళ్లి ఏమైనా పరామర్శించారా అని ఆలపాటి రాజేంద్రప్రసాద్ జగన్ ను ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు ప్రకటించిన కోటి రూపాయలు డబ్బులు జగన్ ఎన్ని రోజులైనా ఇవ్వలేదని, గతంలో సీఎం హోదాలో ప్రజల కోసం నీతినిజాయితీగా పనిచేసి ఉంటే ఆ కోటి రూపాయలు ఇవ్వడానికి ఇన్నిరోజులు అవసరమా అంటూ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. అధికారం దూరమైన తర్వాత జగన్ ఇప్పుడు మళ్లీ ఓదార్పుయాత్ర అంటూ డ్రామాలు ఆడుతున్నారని ఆలపాటి ఆరోపించారు.
సహనపై దాడి చేసిన నవీన్ అనే వ్యక్తి తల్లి మేము వైసీపీలోనే ఉన్నామని ఇప్పటికే చెప్పారని, కానీ నవీన్ టీడీపీ కార్యకర్త అంటూ జగన్ ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. సహన కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తానని బహిరంగంగా ప్రకటించిన జగన్ ఆ డబ్బులు ఇస్తారా లోదే కూడా తెలీదని, వరద బాధితుల కోసం ఇస్తానన్న కోటి రూపాయలు ఎంతవరకు ఇవ్వలేదని, ఇప్పుడు సహన కుటుంబానికి ఇస్తానని చెప్పిన 10 లక్షలు ఇచ్చే వరకూ గ్యారెంటీ లేదని, జగన్ మాటలను ప్రజలు నమ్మడంలేదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications