రోజా అరెస్ట్ ఆ రోజునే .. ముహూర్తం ఫిక్స్
వైసీపీ నేతలు వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే కొడాలి నాని, వల్లభనేని వంశీ,నందిగం సురేష్ , పేర్ని నాని, మిథున్ రెడ్డి,జోగి రమేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి మొదలగు వైసీపీ కీలక నేతలపై కేసులు నమోదు కాగ, వల్లభనేని వంశీ,పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి,నందిగం సురేష్‌లను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. రెండు రోజుల క్రితమే ఎంపీ మిథున్ రెడ్డి సైతం జైలుకు వెళ్లారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లో వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా పేరు కూడా వినిపిస్తోంది.
రోజా మంత్రిగా ఉన్న సమయంలో అవినీతి చేశారని ఫిర్యాదులు అందడంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు.రోజా మంత్రిగా ఉన్న సమయంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్, ఇతర క్రీడా కార్యక్రమాల్లో నిధుల గోల్‌మాల్‌పై చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగానే సీఐడీకి వివిధ క్రీడా సంఘాలు, సీనియర్ క్రీడాకారులు చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్దమైంది.

ఆటలకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేశారని ఆట్యపాట్య సంస్థ సీఈవో ప్రసాద్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. అప్పటి క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అప్పటి అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీఐడీ..ఈ ఫిర్యాదుపై తదుపరి చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. ఇదే జరిగితే.. రోజా, కృష్ణదాస్‌లు విచారణకు సిద్ధం కావాల్సి ఉంటుంది.
ఆడుదాం ఆంధ్ర వ్యవహారంపై విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రస్తుత క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఏపీ శాప్ చైర్మన్ రవి నాయుడు స్పందించారు. మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టుకు వారెంట్ సిద్ధమవుతోందని శాప్ ఛైర్మన్ రవినాయుడు అన్నారు. ఆగస్టు 10లోగా ఆమె జైలుకెళ్లక తప్పదని ఆయన పేర్కొన్నారు. 'గతంలో స్పోర్ట్స్ మినిస్టర్‌గా రోజా చేసిన అవినీతి బయటపడుతోంది. 'ఆడుదాం ఆంధ్రా' కార్యక్రమంతో ఆమె కోట్లు దోచేశారు. దీనిపై విచారణ జరుగుతోంది. రోజా రోజులు లెక్క పెట్టుకోవాలి. ఆమె జైలుకెళ్లడం ఖాయం' అని శాప్ ఛైర్మన్ వ్యాఖ్యానించారు. తనని అరెస్ట్ చేస్తారని కూటమి నేతల చేస్తోన్న ప్రచారంపై రోజా ఎలా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications