టెంపుల్ టౌన్ తిరుపతి ప్రశాంతత, ప్రతిష్టను మంట గలుపుతున్న టీడీపీ- అందుకే ఈ దారుణం: రోజా
Bhumana Karunakar Reddy: మున్సిపల్ ఎన్నికల వేళ తిరుపతిలో అధికార తెలుగుదేశం పార్టీ, జనసేనకు చెందిన నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. వైసీపీ కార్పొరేటర్లు వెళ్తోన్న బస్సుపై రాళ్లతో దాడి చేశారు. వారిని బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు.
మేయర్ ఎన్నిక ఓటింగ్ కోసం ఎస్వీ యూనివర్సిటీకి వెళ్తోన్న సమయంలో కార్పొరేటర్ల బస్సుపై జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ దాడులకు పాల్పడినట్లు చెబుతున్నారు. రాళ్లు విసరడంతో బస్సు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఆ సమయంలో కొందరు నాయకులు వైసీపీ కార్పొరేటర్లను అపహరించడానికీ ప్రయత్నించినట్లు వైసీపీ విమర్శిస్తోంది.

బస్సుపై దాడి చేసిన వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి చెందిన శంకర్ యాదవ్‌గా గుర్తించినట్లు తిరుపతి వైఎస్ఆర్సీపీ నాయకులు తేల్చి చెబుతున్నారు. శంకర్ యాదవ్ బస్సు అద్దాలను ధ్వంసం చేశాడని ఆరోపించారు. అక్కడే ఉన్న వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్తలతోనూ అతను అనుచితంగా వ్యవహరించాడంటూ విమర్శించారు.
ఈ ఘటన పట్ల అటు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్ కే రోజా ఘాటుగా స్పందించారు. ఈ దాడులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేశారు.
తిరుపతి పరువు, ప్రతిష్ట, ప్రశాంతతను మంటగలపడమే లక్ష్యంగా చంద్రబాబు పని చేస్తోన్నారంటూ రోజా ఆరోపించారు. గతంలో తిరుమల లడ్డూ మొదలుకుని టోకెన్ కౌంటర్ల వద్ద తొక్కిసలాటలో ఆరుమంది మరణించడం, ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కార్పొరేటర్లు, మేయర్, దళిత ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తిపై దాడులు చేయడం వరకు జరిగిన ఉదంతాలు దీనికి నిదర్శనమని అన్నారు.
ఒకవైపు వైసీపీ నాయకులు తమకు అక్కర్లేదంటూ మంత్రి నారా లోకేష్ చెబుతూ.. అదే వైసీపీ కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ పదవి కోసం దాడులు చేయిస్తోన్నాడంటూ నిప్పులు చెరిగారు. కార్పొరేటర్లను బూతులు తిట్టారని, వాళ్లను రాళ్లతో కొట్టారంటూ రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ కూడా పోలీసులు చూస్తోండగానే జరిగాయని అన్నారు.
జనసేనకు చెందిన తిరుపతి ఎమ్మెల్యే ఇంతగా దిగజారిపోయి తమ పార్టీ కార్పొరేటర్ల కిడ్నాప్‌కు పాల్పడుతున్నాడో ఒక్కసారి గమనించాలంటూ పవన్ కల్యాణ్‌కు రోజా హితవు పలికారు. ఒక డిప్యూటీ మేయర్ పదవి కోసం తిరుపతిలో ఇంతగా దౌర్జన్యానికి పాల్పడటం చూస్తోంటే కూటమిది ఈవీఎంల ప్రభుత్వం అని మరోసారి రుజువైందని అన్నారు.
పవన్ కళ్యాణ్ దమ్ముంటే..!!#RojaSelvamani #RKRoja #PawanKalyan #Tirupati #APPolitics #AndhraPradesh #OITelugu pic.twitter.com/pfBYLCmFW3
— oneindiatelugu (@oneindiatelugu) February 3, 2025
జనం ఓట్లతో గెలిచివుంటే అదే జనాన్ని భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించి ఉండేవాళ్లు కాదని రోజా చెప్పారు. తిరుపతి మేయర్‌ను టీడీపీ, జనసేన నాయకులు ఏ రకంగా అవమానాలకు గురి చేస్తోన్నారో.. ఆమెపై దాడి చేస్తోన్నారో ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఈవీఎం ద్వారా గెలవడం వల్లే ఎన్నికల్లో ప్రజలు ఓట్లేస్తారనే నమ్మకం లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications