టెక్కీలపై పిడుగు: 21,000 మంది అవుట్
టెక్ దిగ్గజం ఒరాకిల్ మరోసారి లేఆఫ్స్ కు తెరతీసింది. భారీ ఎత్తున తన ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. భవిష్యత్తులో ఐటీ పరిశ్రమను శాసించబోయే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో భారీగా పెట్టుబడులు పెట్టే క్రమంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఏఐ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కల్పన కోసం పెద్ద ఎత్తున నిధులను సమకూర్చుకునే వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా లేఆఫ్స్ చేపట్టింది.
21,000 మందిపై వేటు
సంస్థ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 21,000 మంది ఉద్యోగులను ఈ టెక్ దిగ్గజం తొలగించింది. ఏఐ ఆధారిత మార్పుల వల్ల రానున్న రోజుల్లో మరింత మందిని తొలగించే అవకాశం ఉందని స్పష్టం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఒరాకిల్‌లో చోటు చేసుకున్న తాజా పునర్వ్యవస్థీకరణ వల్ల కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 13 శాతం తగ్గిపోయింది.

క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐల్లో..
గత ఏడాది 1,62,000 గా ఉన్న సిబ్బంది సంఖ్య ఈ ఏడాది మే 31 నాటికి 1,41,000 కు పడిపోయిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ రంగాల్లో అగ్రగామిగా నిలవడానికి కంపెనీ తీసుకుంటున్న వ్యూహాత్మక మార్పుల వల్లే ఈ భారీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని యాజమాన్యం వెల్లడించింది.
ఏఐ టెక్ వాడకం..
వ్యాపార నిర్వహణ అంతటా ఏఐ టెక్నాలజీ ప్రవేశపెట్టడం వల్లే ఉద్యోగులను తగ్గించాల్సి వచ్చిందని ఒరాకిల్ అధికారికంగా ప్రకటించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడకంతో పాటు మేనేజ్‌మెంట్ విధానపరమైన నిర్ణయాలు, ఉత్పత్తుల పునర్వ్యవస్థీకరణ, వ్యూహాత్మక మార్పులు, వివిధ కంపెనీల టేకోవర్ ప్రక్రియ కూడా ఈ లేఆఫ్స్‌కు కారణాలు అయ్యాయి.
భవిష్యత్తులో మరిన్ని..
ఏఐ విస్తరణతో భవిష్యత్తులోనూ ఇదే తరహా సిబ్బంది తగ్గింపు చర్యలు కొనసాగే అవకాశం ఉందని ఒరాకిల్ స్పష్టం చేసింది. ఒకప్పుడు డేటాబేస్ సాఫ్ట్‌వేర్ సంస్థగా ఉన్న ఒరాకిల్ ఇప్పుడు నూతన రూపాన్ని సంతరించుకుంది. క్లౌడ్, ఏఐ రంగాల్లో ఓ ప్రధాన శక్తిగా మారడానికి ప్రయత్నిస్తోంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజాలతో పోటీ పడేందుకు వీలుగా పెద్ద ఎత్తున ఏఐ డేటా సెంటర్లను ఒరాకిల్ నిర్మిస్తోంది.
రుణాల సేకరణ..
ఓపెన్ ఏఐ వంటి గ్లోబల్ క్లయింట్ల కోసం అత్యాధునిక మౌలిక వసతులను కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. భారీ డేటా సెంటర్ల నిర్మాణం కోసం ఒరాకిల్ బిలియన్ల కొద్దీ నిధులను ఖర్చు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 70 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఒరాకిల్ అంచనా వేస్తోంది. ఈ నిధుల సేకరణ కోసం అప్పులు చేయడంతో పాటు బాండ్ల ద్వారా సుమారు 40 బిలియన్ డాలర్లను సమకూర్చుకోవాలని ప్రణాళిక సిద్ధం చేసింది.
లేఆఫ్స్ వల్ల నష్టం..
ఈ ఉద్యోగాల కోతల వల్ల ఒరాకిల్‌కు భారీగా నష్టం కూడా వాటిల్లింది. కంపెనీ నుండి తొలగించిన ఉద్యోగులకు సెవరెన్స్ ప్యాకేజీలు, ఇతర పరిహారాల రూపాయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 1.84 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి వచ్చింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ పునర్వ్యవస్థీకరణ ఖర్చు 374 మిలియన్ డాలర్లు మాత్రమే.












Click it and Unblock the Notifications