ఇప్పుడే కొనొద్దు.. కాస్త ఆగండి.. ఫోన్ ధరలు తగ్గే టైమ్ వచ్చేసింది!
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇప్పుడే ఫోన్ కొనకుండా కొద్దిరోజులు వేచి చూడటం వల్ల మీ డబ్బులు ఆదా అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఖరీదైన ఫ్లాగ్‌షిప్ కొనాలని చూస్తున్న వారికి అక్టోబర్ నెలలో వచ్చే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ సేల్‌లో ఐఫోన్, శాంసంగ్ గెలాక్సీ, గూగుల్ పిక్సెల్ వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏఐ ఫీచర్లు స్మార్ట్ ఫోన్ మార్కెట్లో కీలకంగా మారాయి. కొత్త ఫోన్లలో ఏఐ ఆధారిత కెమెరా ఫీచర్లు, ఫోటో ఎడిటింగ్, వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లను కంపెనీలు ఎక్కువగా అందిస్తున్నాయి. దీంతో కొన్ని మోడళ్ల ధరలు కూడా పెరిగాయి. ఈ క్రమంలో ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్న వినియోగదారులు సేల్ కోసం వేచి చూస్తే డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ ద్వారా ధరను తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
అక్టోబర్ 9 నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్
ఈ ఏడాది ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 9 నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ మెంబర్లు, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ఓ రోజు ముందుగానే.. అంటే అక్టోబర్ 8 నుంచే ఈ సేల్ ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. సేల్‌కు సంబంధించిన బ్యాంక్ డిస్కౌంట్లు, చెల్లింపు ఆఫర్ల వివరాలు బయటకు వచ్చినప్పటికీ.. ఏ మోడల్ ఎంత ధరకు లభిస్తుందనే తుది ధరలను ఫ్లిప్‌కార్ట్ ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.

ఐఫోన్, శాంసంగ్, గూగుల్ పిక్సెల్‌లపై అంచనాలు
గత మోడళ్లతో పోలిస్తే ఇటీవల విడుదలైన ఐఫోన్ 18 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎస్26 సిరీస్ మోడళ్ల ధరలు మార్కెట్లో ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 16 మోడళ్లతో పాటు శాంసంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రా, గూగుల్ పిక్సెల్ ఫోన్లపై గణనీయమైన తగ్గింపులు లభిస్తాయని కొనుగోలుదారులు భావిస్తున్నారు. సరసమైన ధరల్లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లను పొందాలనుకునే వారికి ఈ సేల్ నుంచి ప్రత్యామ్నాయంగా మారనుంది.
బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు
ఈ సేల్‌లో ప్లాట్‌ఫాం డిస్కౌంట్ తో పాటు బ్యాంక్ ఆఫర్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై 10 శాతం వరకు తక్షణ తగ్గింపు లభించే అవకాశం ఉంది. దీనికి తోడు మీ వద్ద ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా దాని పనితీరు, మోడల్ ను బట్టి అదనపు మినహాయింపు పొందవచ్చు. సేల్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్.. ఈ మూడూ కలిస్తే ఫోన్ తుది కొనుగోలు ధర గణనీయంగా తగ్గుతుంది.
కొనుగోలుదారులకు సూచనలు
ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌లో 'ప్రైస్ క్రాష్',' రష్ అవర్స్', 'టిక్ టాక్ డీల్స్' వంటి పరిమిత సమయ ఆఫర్లను కూడా పరిచయం చేయనుంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే అనధికారిక ధరలను చూసి హడావిడిగా నిర్ణయం తీసుకోకుండా, సేల్ ప్రారంభమయ్యాక అధికారిక ధరలను పరిశీలించడం శ్రేయస్కరం. మీరు కొనాలనుకుంటున్న ఫోన్ ప్రస్తుత మార్కెట్ ధరపై ముందుగానే ఓ అంచనా ఉంచుని, సేల్ సమయంలో తుది ధర, బ్యాంక్ నిబంధనలు సరిచూసుకుని కొనుగోలు చేయడం మంచిది.












Click it and Unblock the Notifications
