వైసీపీని వీడి తిరిగి టీడీపీలోకి ఆ మాజీ మంత్రి ! టికెట్ కూడా ఖరారు..!
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీల నుంచి నేతల ఫిరాయింపుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే అధికార వైసీపీలో సీట్లు దక్కని పలువురు నేతలు బీజేపీ, టీడీపీ, జనసేనతో పాటు కాంగ్రెస్ లోనూ చేరిపోతున్నారు. అయితే టీడీపీకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఓ కీలక నేత మాత్రం తిరిగి సొంత గూటికి చేరుకునేందుకు కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. దీంతో టీడీపీలో ఆయన రిటర్న్ కు ముహుర్తం ఖరారైంది.
ప్రకాశం జిల్లాకు చెందిన వైశ్య సామాజిక వర్గ నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు గతంలో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీ ఎంపీగా ఒంగోలు నుంచి పోటీ చేసి గత ఎన్నికల్లో ఓడిపోయారు. అనంతరం టీడీపీ అధికారం కోల్పోయాక వైసీపీలోకి ఫిరాయించారు. ఇప్పుడు వైసీపీలో టికెట్ దక్కకపోవడంతో తిరిగి టీడీపీ గూటికి చేరుకునేందుకు సిద్దమవుతున్నారు. కీలకమైన వైశ్య సామాజిక వర్గ నేత కావడం, ప్రకాశం రాజకీయాల్లో పట్టు ఉండటంతో టీడీపీ కూడా ఆయన్ను చేర్చుకునేందుకు సిద్దమైంది.

ఈ నెల 27న చంద్రబాబు సమక్షంలో శిద్ధా రాఘవరావు తిరిగి టీడీపీ లో చేరబోతున్నారు. ఆయనకు ప్రకాశం జిల్లాలోని ఆయన పాత సీటు దర్శి కేటాయించే అవకాశాలున్నాయి. గతంలో వైసీపీలో అంతర్గత పోరు కారణంగా దర్శిలో శిద్ధా విజయం సాధించారు. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ను కాదని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి వైసీపీ టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన్ను ఢీకొట్టే సరైన అభ్యర్ధి కోసం ఎదురుచూస్తున్న టీడీపీకి గ్రానైట్ వ్యాపారి కూడా అయిన శిద్ధా రాఘవరావు బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications